సనాతన ధర్మ విలసిల్లాలి! గణేశ శర్మకు సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు విషెస్

by Ramesh N |
సనాతన ధర్మ విలసిల్లాలి! గణేశ శర్మకు సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్‌రావు విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని (Kanchi Kamakoti Peetham) ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా ఋగ్వేద పండితుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ (Ganesha Sharma) ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు. ఈ నెల 30న అక్షయ తృతీయ సందర్భంగా ఆయనకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు విజయేంద్ర సరస్వతి శంకరాచార్యులు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సహ పలువురు ప్రముఖులు గణేశ శర్మకు విషెస్ తెలియజేశారు. గణేశ శర్మ ఋగ్వేద పండితులుగా బాసరలోని జ్ఞాన సరస్వతి దేవికి, తెలంగాణ ప్రాంతానికి ఎలలేని ధార్మిక సేవ చేశారని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఋగ్వేదంలోనే కాకుండా యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తుల్లో జగద్గురు పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారి కృపతో అపారమైన జ్ఞానార్జన చేశారని గుర్తుచేశారు. సనాతన ధర్మ గురుపరంపరకు, భక్తి తత్వానికి, జ్ఞాన మార్గానికి బాటలు వేసే ఈ వేడుక తెలంగాణ ప్రజలందరికీ మధుర జ్ఞాపకం కాబోతోందని అన్నారు.

మంగళకరమైన అక్షయ తృతీయ రోజున (30 ఏప్రిల్) జరగనున్న ఈ అభిషేక వేడుక సందర్భంగా కంచి కామకోటి పీఠానికి తెలంగాణ ప్రజల తరఫున ముఖ్యమంత్రి ప్రణామాలు తెలియజేశారు. ఈ గురుపరంపర ధర్మాన్ని, జ్ఞానాన్ని, శాంతిని మానవాళికి ఎల్లప్పుడూ అందించాలని సందేశంలో ఆకాంక్షించారు. అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావు ఒక సందేశం విడుదల చేశారు. వేదవిదులు, ఉపనిషత్ జ్ఞాన నిధులు దుడ్డు సూర్య సుబ్రహ్మణ్య శర్మ స్వామి వారు కంచి కామకోటి పీఠ ఆచార్యులుగా అభిషిక్తులవుతున్న శుభవేళ సాదర ప్రణామాలు అని తెలిపారు. పరమాచార్య చంద్రశేఖర సరస్వతి, జయేంద్ర సరస్వతుల పరంపరలో 71వ ఆచార్యులుగా విశేష బాధ్యతలు స్వీకరిస్తున్న స్వామి వారి మార్గదర్శకత్వంలో సనాతన ధర్మం విలసిల్లాలని ఆకాంక్షించారు.



Next Story