CM Revanth: వారి సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది

by Gantepaka Srikanth |
CM Revanth: వారి సంరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నది
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళలు ఆరోగ్యంగా ఉంటే అది వారి కుటుంబానికే కాక మొత్తం సమాజానికే ప్రయోజనం కలుగుతుందన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఆ ఆరోగ్య సంరక్షణే దేశ ప్రగతికి, సమాజ పురోభివృద్ధికి పునాది అని అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఆ దిశగానే కార్యాచరణ జరుగుతూ ఉన్నదని అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించేందుకు సుధారెడ్డి ఫౌండేషన్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన పింక్ పవర్ రన్ – 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఆరోగ్యపరంగా, మానసికంగా, శారీరకంగా పటిష్టంగా ఉన్నప్పుడే యావత్తు సమాజానికి మేలు జరుగుతుందన్నారు. మహిళలు వారంతట వారుగా ఒంటరిగా సవాళ్ళను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం రావాలని, అందుకోసం ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహాయ సహకారాలను అందిస్తుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలను తీసుకుంటున్నదని గుర్తుచేశారు.

భవిష్యత్తులోనూ వారి సంక్షేమం, సంరక్షణ కోసం ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త ఆస్పత్రులు వస్తాయని, వ్యవస్థను బలోపేతం చేస్తామన్నారు. మొత్తం తెలంగాణ సమాజం ప్రభుత్వానికి సహకరించాలని అప్పీల్ చేసిన సీఎం.. మహిళలకు మరింత సాధికారికత కల్పించే భవిష్యత్తు నిర్మాణానికి తోడ్పడాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, ‘శాట్’ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పింక్ పవర్ రన్‌లో గెలుపొందినవారికి ముఖ్యమంత్రి బహుమతులను ప్రదానం చేశారు.

Advertisement

Next Story

Most Viewed