భట్టి విక్రమార్కకు చేతులెత్తి దండం పెట్టిన బాధితులు.. ఎంత కష్టం వచ్చిందో తెలుసా?

by GSrikanth |
భట్టి విక్రమార్కకు చేతులెత్తి దండం పెట్టిన బాధితులు.. ఎంత కష్టం వచ్చిందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన్ను చందనవెల్లి భూ బాధితులు కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేసిందని.. ఎంజాయ్మెంట్ సర్వేతో అసలైన లబ్ధిదారులకు పరిహారం ఇవ్వకుండా బోగస్ లబ్ధిదారులకు పరిహారం ఇచ్చారని మంత్రికి బాధితులు ఫిర్యాదు చేశారు. భూసేకరణలో పట్టాదారులకు నాలుగు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు మాత్రమే రికార్డుల్లో చూపించి సగం భూమికి మాత్రమే పరిహారం ఇచ్చారని గోడు వెళ్లబోసుకున్నారు.

భూసేకరణలో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వేడుకున్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి ప్రత్యేక జీవో ద్వారా ఎకరానికి తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే పరిహారం ఇచ్చారని ఆవేదన చెందారు. రైతులు ఇచ్చిన భూముల్లో పరిశ్రమలు స్థాపించిన యజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు కూడా కల్పించలేదని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రుల పర్యటన సందర్భంగా భూ బాధితులను కలవకుండా పోలీస్ స్టేషన్లో నిర్భందించే వారని, ఇప్పుడు మాకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు భూ బాధితులు చేతులెత్తి దండం పెట్టారు.

చందనవెల్లి భూ భాధితులకు సహేతుకంగా శాస్త్రీయంగా నష్టపరిహారం అందించాలని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పామేనా భీమ్ భరత్ భట్టిని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు.. చందనవెల్లి గ్రామానికి పక్కన ఉన్న సీతారాంపూర్‌లో 1148 ఎకరాల ప్రభుత్వం తీసుకున్నదని, అక్కడ భూ బాధితులకు ఎకరానికి రూ.21 లక్షల పరిహారం, ఎకరానికి 121 చదరపు గజాల స్థలం పరిహారంగా ఇచ్చారని చంద్రవెల్లిలో కూడా ఇదే అమలు చేయాలని భరత్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు.

Advertisement

Next Story

Most Viewed