MLC Kavitha : ప్రధానిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు

by Ramesh N |   ( Updated:2024-11-21 12:22:39.0  )
MLC Kavitha : ప్రధానిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్.. తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ గ్రూప్ సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు గురువారం ఎక్స్ వేదకగా సంచలన ట్వీట్ చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారిగా ఎమ్మెల్సీ కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, ప్రధాని మోడీపై తీవ్ర ఆరోపణలు చేశారు.

అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా? అని ప్రశ్నించారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ అని పేర్కొన్నారు. ఆధారాలు ఉన్నా అదానీని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? అని ప్రధాని మోడీని కవిత ప్రశ్నించారు. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని సూటిగా ప్రశ్నించారు. జైలు నుంచి విడుదల అయ్యాక తొలిసారి కవిత ఎక్స్ వేదికగా రాజకీయ వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. పొలిటికల్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని సంకేతాలు ఇస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో చర్చానీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజా ట్వీట్ వైరల్‌గా మారింది. ట్వీట్ చేసిన గంటలోపే వెయ్యికి పైగా లైక్స్, వందకు పైగా కామెంట్స్ వచ్చాయి.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఆరోపణలతో తిహార్ జైల్లో ఉన్న కవిత గత ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారని, దీనిపై వడ్డీతో సహా వారికి చెల్లిస్తానని ఆమె శపథం చేశారు. జైలు నుంచి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత మొత్తం రెండు ట్వీట్‌లు వేశారు. సత్యమేవ జయతే అంటూ ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఫామ్‌హౌజ్‌లో కలిసిన ఫొటోను షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed