Group 1 : గ్రూప్ 1 పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

by M.Rajitha |
Group 1 : గ్రూప్ 1 పై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షల(Group 1 Exams)పై ప్రతిపక్షాల ఆరోపణలు ఆగడం లేదు. గ్రూప్ 1 వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Padi Koushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, వాటిపై సీబీఐ విచారణ(CBI Probe) జరిపించాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని, కోట్ల రూపాయలు చేతులు మారాయని అన్నారు. ఓ కాలేజీలోని 18, 19వ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసిన 1497 మందిలోనే 74 మంది ఎలా ఎంపిక అవుతారని, అసలు పరీక్షలే రాయని 10 మంది ఎలా ఎంపిక అవుతారని ఆయన ప్రశ్నించారు. 654 మందికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయో చెప్పాలని ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని నిలదీశారు.

పేపర్లను ప్రొఫెసర్లతో ఎందుకు కరెక్షన్ చేయించలేదో తెలపాలని అన్నారు. పైకి పరీక్షలు నిర్వహించి, లోపల మాత్రం ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. ఇన్ని లోపాలు కనిపిస్తుంటే ప్రభుత్వం మాత్రం ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. వెంటనే గ్రూప్ 1 నియామకాలు నిలిపి వేయాలని.. ఈ పరీక్షలపై సీబీఐ విచారణ జరిపించాలని పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాగా గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయంటూ ఇటీవలే బీఆర్ఎస్ మరోనేత పైడి రాకేశ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed