కేసీఆర్‌ను వరుసగా ఇరికిస్తున్న సీనియర్లు.. పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో చిక్కులు!

by GSrikanth |
కేసీఆర్‌ను వరుసగా ఇరికిస్తున్న సీనియర్లు.. పార్లమెంట్ ఎన్నికల ముంగిట్లో చిక్కులు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ చలికాలంలోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీస్తామని చెప్పిన కాంగ్రెస్.. గత ప్రభుత్వ వైఫల్యాలను తమకు బలంగా మార్చుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తుండటం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారుతున్నది. అనుభవం లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని, రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం తమకు పేలపిండి వ్యవహారం అని భావించిన బీఆర్ఎస్.. అసెంబ్లీ వేదికగా సెల్ఫ్ గోల్ కు పాల్పడిందా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అపారమైన అనుభవం కలిగిన బీఆర్ఎస్ సీనియర్ నేతలు వరుసగా తమ మాటలతో గులాబీ దళపతి కేసీఆర్ ను ఇరుకున పెడుతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మొన్న హరీశ్.. నిన్న జగదీశ్ రెడ్డి:

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలలోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్లుగా గుర్తింపు ఉన్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డిల వ్యవహారం గులాబీ పార్టీని ఇరుకున పెట్టిందా అనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో హరీశ్ రావు రావు మాట్లాడుతూ 42 పేజీల శ్వేతపత్రాన్ని తమ చేతికి ఇచ్చి 4 నిమిషాల్లో చదివి మాట్లాడమంటే ఎలా? ప్రిపేర్ కావడానికి తమకు టైమ్ ఇవ్వాలని కోరారు. దీనిపై అధికార పక్షం స్పందిస్తూ గతంలో ప్రిపేర్ కాలేదని తాము చెబితే అవమానించేలా మాట్లాడారని కానీ తాము మాత్రం అలా చేయబోమని సభ్యులు చదువుకునేందుకు సమయం ఇవ్వాలని స్పీకర్ ను కోరింది.

నివేదికలు ముందుగా ఇచ్చే ప్రాక్టీస్ లేనప్పటికీ మార్పు తెచ్చే ఉద్దేశంతో తాము ప్రతిపక్షాలు ప్రిపేర్ కావడానికి సమయం ఇచ్చామని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇక నిన్న విద్యుత్ ఒప్పందాలన్నింటిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేయాలంటూ మాజీ మంత్రి డిమాండ్ చేయగా వెంటనే సీఎం న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టబోయి సెల్ఫ్ గోల్ అయ్యారా అనే వాదన వినిపిస్తోంది. నిజానికి గత ప్రభుత్వ హయాంలోని వైఫల్యాలను వెలికి తీసేందుకు ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జగదీశ్వర్ రెడ్డి ఛాలెంజ్ హాట్ కేక్ కామెంట్ గా మారిందనే చర్చ జరుగుతున్నది. ఇక కడియం శ్రీహరి వంటి వారు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను విమర్శల పాలు చేయగా దానం నాగేందర్, మల్లారెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.

గతాన్నే తమ బలంగా..:

బీఆర్ఎస్ విమర్శలపై గత ప్రభుత్వ విధానాలనే తమ బలంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఓ వైపు హామీల అమలుకు కావాల్సిన కార్యచరణను సిద్ధం చేసుకుంటూనే మరోవైపు తమది ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం అని చాటిచెప్పేందుకు ఉపయోగించాల్సిన అన్ని అంశాలపై దృష్టి సారిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కంచెను తొలగించడం, సెక్రటేరియట్ లోకి ప్రతిపక్షాలకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రజావాణి ద్వారా సీఎం, మంత్రులు ప్రజల సమస్యలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోవడం వెనుక గత ప్రభుత్వం ఎక్కడైతే విఫలం అయిందో అక్కడ మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోందనే వాదన వినిపిస్తోంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరికేది కాదని ఉద్యోగులు, సొంత పార్టీ నాయకులే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాల నుంచి తమ ప్రభుత్వంలో అటువంటి ఇబ్బందులేవి ఉండవని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ వ్యాఖ్యలతో సొంత పార్టీని ఇరుకున పెడుతున్నారా అనే టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story