విచారణ ఇక్కడితోనే ఆగదా.. కవిత భవిష్యత్తుపై BRS నేతల ఆందోళన

by Nagaya |   ( Updated:2022-12-12 02:31:31.0  )
విచారణ ఇక్కడితోనే ఆగదా.. కవిత భవిష్యత్తుపై BRS నేతల ఆందోళన
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే అనుమానాలు బీఆర్ఎస్ నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆ స్కామ్ కేసులో కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి సాక్షిగానే విచారించింది. ఆదివారం ఇంటరాగేషన్ పూర్తయిన తర్వాత 91 సీఆర్పీసీ కింద నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది. దీంతో భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చనే ఆందోళన గులాబీ నేతల నుంచి వ్యక్తమవుతున్నది. సీబీఐ డీఐజీ రాఘవేంద్ర నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఆదివారం ఏడున్నర గంటల పాటు ప్రశ్నించింది. విచారణ జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారి మనసులోని మాటను బయటపెట్టారు. ప్రశ్నిస్తున్నందునే ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలతో బీజేపీ వేధిస్తున్నదంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగేంతవరకూ ఈ ఎపిసోడ్‌ను కంటిన్యూ చేస్తారనే ఆందోళనను సైతం వ్యక్తం చేశారు. దీంతో కవితను సీబీఐ, ఈడీ సంస్థలు ఇకపైన కూడా ప్రశ్నించనున్నాయనే అనుమానం వారి మాటల్లోనే వ్యక్తమవుతున్నది. లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉన్నదని, నేరానికి పాల్పడిన ఆమె శిక్ష అనుభవించక తప్పదని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇలాంటి స్కామ్‌లు చేసి సంపాదించిన అక్రమ సొమ్ముతోనే కవిత ఇంద్రభవనం లాంటి ఇంటిని కట్టుకున్నారని, పార్టీ కార్యకర్తలు, ప్రజలే కాక విచారణకు వచ్చిన సీబీఐ అధికారులు సైతం ఆ ఇంటి లగ్జరీని చూసి విస్తుపోతున్నారని బీఎస్కే పేర్కొనడం గమనార్హం.

స్వపక్షంలోనూ ఆందోళన

విపక్షాల మాటలు ఇలా ఉంటే.. స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ లిక్కర్ పాలసీ మేకర్ ఎమ్మెల్సీ కవిత కాదని, ఆ స్కాంతో ఆమెకు సంబంధం లేదన్నారు. నిజంగా కవిత తప్పు చేసినట్లు తేలితే పార్టీ అధినేత కేసీఆర్ సహా ఆయన అడుగుజాడల్లో నడిచే తామంతా ఆమెకు సహకారాన్ని బంద్ చేస్తామన్నారు. నేరం ఎవరు చేసినా శిక్ష పడాల్సిందేనని అన్నారు. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో తెలంగాణను బదనాం చేయడానికి, కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకుని బీజేపీ చేస్తున్నది రాజకీయ క్రీడ అని అభివర్ణించారు. తెలంగాణలో వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తమ పార్టీ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లోనూ మరోసారి పవర్‌లోకి రావడం ఖాయమన్నారు. ఈ సంగతి తెలిసిన బీజేపీ.. తమ పార్టీని బ్లేమ్ చేయడానికి కవితను ప్రశ్నించే ప్రక్రియను ఎన్నికల దాకా నడిపిస్తుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఎంక్వయిరీలు, బెదిరించే తీరు తమను భయపెట్టలేదని, లొంగదీసుకోవడం కూడా సాధ్యం కాదని బీజేపీని హెచ్చరించారు. నిజానికి కాంగ్రెస్ అసమర్థతతోనే ఈ సిస్టమ్ ఇలా తయారైందన్నారు. సీబీఐ ఎంక్వయిరీ టైమ్‌లో ఎవ్వరూ తన ఇంటి దగ్గరకు రావద్దని స్వయంగా కవిత పిలుపునిచ్చినా ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా ఎమ్మెల్యే క్రాంతికిరణ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు అయాచితం శ్రీధర్, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ తదితరులు అక్కడకు చేరుకున్నారు. కవితను సీబీఐ ప్రశ్నించడం వెనక రాజకీయ కక్షసాధింపు ఉద్దేశం ఉన్నదని వ్యాఖ్యానించారు. విపక్షాలపై బీజేపీ విధానాన్ని చూసి దేశ ప్రజానీకమే అసహ్యించుకుంటున్నదన్నారు. లిక్కర్ స్కామ్‌లో దినేశ్​ అరోరాను అప్రూవర్‌గా మార్చుకున్న సీబీఐ అతను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా కవితను ప్రశ్నించడానికి రావటాన్ని యావత్తు తెలంగాణ మీద దాడిగానే చూడాల్సి ఉంటుందన్నారు.

ఏకధాటిగా ఎంక్వైరీ!

సాక్షిగా మాత్రమే తనకు నోటీసులు ఇచ్చారని, విచారణకు సహకరిస్తానని స్వయంగా ఎమ్మెల్సీ కవిత ఈ నెల మొదటివారంలో స్పష్టంగా చెప్పారు. విచారణకు భయపడేది లేదని అంటూనే వివిధ కారణాలతో 6వ తేదీ విచారణను 11వ తేదీకి ఫిక్స్ చేశారు. నిందితురాలు కానందువల్ల కొద్దిసేపట్లోనే సీబీఐ ఎంక్వయిరీ ముగుస్తుందని భావించిన పార్టీ నేతలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా (లంచ్ బ్రేక్ మినహా) జరగడం మరింత ఆందోళన కలిగించింది. ఏడున్నర గంటల విచారించిన సీబీఐ అధికారులు వెళ్లే సమయంలో ఆమెకు సీఆర్పీసీ 91 కింద నోటీసులు జారీ చేశారు. తగిన డాక్యుమెంట్లతో ఢిల్లీలోని సీబీఐ ఆఫీసులో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు.

త్వరలో ఈడీ విచారణ కూడా..?

ఎన్‌పోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కూడా ఉంటుందనేది ఆ పార్టీ నేతలకు మింగుడుపడడంలేదు. ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఢిల్లీలోని స్పెషల్ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో రెండు నెంబర్లతో మొత్తం పది ఫోన్లను మార్చారని, డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసినట్లు కవితపై ఈడీ కామెంట్లు చేసింది. 'సౌత్ గ్రూపు' పేరుతో ఢిల్లీ లిక్కర్ పాలసీలో కవిత ప్రమేయం ఉన్నదని, వైఎస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు అరబిందో ఫార్మా ఫుల్ టైమ్ డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డితో కలిసి జోక్యం చేసుకున్నట్లు ఈడీ ఆరోపించింది. సుమారు రూ. 100 కోట్ల మేర విజయ్ నాయర్ ద్వారా ఆప్ నేతలకు ఈ గ్రూప్ ద్వారానే ముడుపులు అందాయని పేర్కొన్నది. దీంతో ఇకపైన ఈడీ విచారణ కూడా ఉంటుందనే గుబులు గులాబీ పార్టీ నేతలను వేధిస్తున్నది.

కేసీఆర్ ఫ్యామిలీలో మొదటి వ్యక్తి..

కవిత.. కేసీఆర్ ఫ్యామిలీలో సీబీఐ విచారణ ఎదుర్కొన్న మొదటి వ్యక్తి కావడం గమనార్హం. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్‌పైనా, కల్వకుంట్ల కవితపైన వచ్చిన ఆరోపణలపైనా అటు తండ్రి కేసీఆర్‌గానీ, ఇటు ఆమె సోదరుడు కేటీఆర్‌గానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కవిత రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు పార్టీ నేతల్లోనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశంతో టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి ఢిల్లీ కేంద్రంగా పాలిటిక్స్ నడపాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ దర్యాప్తు సంస్థలను బీజేపీ ఉసిగొల్పుతున్నదని గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పార్లమెంటు ఎన్నికల వరకూ ఇలాంటి వేధింపులు ఉంటాయన్న అనుమానాలను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.

Also Read...

అంతా గోప్యం.. అయినా విక్టరీ! కల్వకుంట్ల ఫ్యామిలీలో ఫస్ట్ వికెట్?

Advertisement

Next Story