ఏ విషయంలో CM రేవంత్‌కు ప్రధాని మోడీ పెద్దన్న?: దాసోజు శ్రవణ్

by GSrikanth |
ఏ విషయంలో CM రేవంత్‌కు ప్రధాని మోడీ పెద్దన్న?: దాసోజు శ్రవణ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో దాసోజు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి ఎలా బడా భాయ్ అంటున్నారని విమర్శించారు. గుజరాత్ మోడల్‌ను తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినట్లు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఓ పాథాలజికల్ లయర్ అని పేర్కొన్నారు. అబద్ధాల పునాదుల మీద పాలన చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి సమర్ధుడైతే కొత్తగా నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజం రేవంత్ తీరును గమనించాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ హయంలో లక్షా 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశారని గుర్తుచేశారు. పదే పదే అబద్ధాలు చెప్పి రేవంత్ లేకితనం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రవేశ పెట్టిన గొర్రెల పంపణీ పథకాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలు.. మేనిఫెస్టోలో గొర్రెల పంపిణీ గురించి ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. కనీసం మేనిఫెస్టోలో ఏముందో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా బీజేపీ కుట్రలు చేస్తుంటే.. మోడీని రేవంత్ రెడ్డి పెద్దన్న ఎలా అంటారని ప్రశ్నించారు. అంటే మోడీనే దేశానికి ప్రధానిగా కొనసాగాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న ఒప్పందాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed