CMRF నిధులను పార్టీ నేతలకు పంచిన బీఆర్ఎస్.. క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు?

by GSrikanth |   ( Updated:2024-02-20 02:14:05.0  )
CMRF నిధులను పార్టీ నేతలకు పంచిన బీఆర్ఎస్.. క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల జారీలో భారీ ఎత్తున గోల్‌మాల్ జరిగినట్టు ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నట్టు తెలిసింది. పేదల వైద్య ఖర్చు కోసం అందించే ఈ నిధులు గులాబీ పార్టీ నేతలకు మళ్లించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా దాదాపుగా రూ.150 కోట్లు కొల్లగొట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ టైంలోనే ఇదంతా జరిగినట్టు టాక్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే రెండు, మూడు నెలల ముందు ఈ అవినీతి జరిగినట్టు సీఎంవో‌కు ఆధారాలతో సహా ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. దీనిపై అంతర్గత విచారణ చేస్తుంటే.. ఒక్కో విషయం బయటపడుతున్నదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

ఒక్కో సెగ్మెంట్‌లో సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలకు..

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌లో సుమారు 50 మంది బీఆర్ఎస్ లోకల్ లీడర్లకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను గత ప్రభుత్వం అందించినట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ కేడర్‌కు ప్రయోజనం కలిగించేందుకే ఈ నిధులను ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లీడర్ హోదా మేరకు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెక్కులను అందజేసినట్టు సమాచారం. ఇలా సుమారు రూ.150 కోట్ల వరకు పంపిణీ చేసినట్టు టాక్. బీఆర్ఎస్ లీడర్ల పేరుతో వచ్చిన అప్లికేషన్లలో ఆస్పత్రికి సంబంధించిన బిల్లులు లేకపోవడం గమనార్హం. వాస్తవానికి సీఎంఆర్ఎఫ్ కింద వచ్చిన దరఖాస్తులకు కచ్చితంగా ఆస్పత్రికి సంబంధించిన ఒరిజినల్ బిల్లులు జతచేయాలి. లేదంటే ఆ అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుంది. కానీ బిల్లులు లేకుండా వచ్చిన దరఖాస్తులకు సైతం చెక్కులు రెడీ చేసి వాటిని పంపిణీ చేసినట్టు ఆఫీసర్లు గుర్తించారు.

క్లియరెన్స్ ఇచ్చింది ఎవరు?

దరఖాస్తులకు ఒరిజినల్ బిల్లులు లేకున్నా చెక్కులు ఎలా జారీ చేశారనే దానిపై సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు సమాచారం. బీఆర్ఎస్ హయాంలో బిల్లులు లేకుండానే వచ్చిన అప్లికేషన్లను ఎవరు తీసుకున్నారు? స్క్రూటినింగ్ ఎందుకు చేయలేదు? ఎవరూ చెపితే ఆ దరఖాస్తులకు క్లియరెన్స్ ఇచ్చారు? అనే కోణంలో కూపీ లాగుతున్నట్టు టాక్.

Advertisement

Next Story