BRS: ప్రభుత్వం రిపోర్టును అంగీకరించం

by Gantepaka Srikanth |
BRS: ప్రభుత్వం రిపోర్టును అంగీకరించం
X

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టిన కులగణన సర్వే నివేదిక తప్పుల తడక అని.. పార్టీలు, బీసీ సంఘాలు ఈ సర్వే రిపోర్టును అంగీకరించడం లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు అన్యాయం చేసే కుట్ర జరుగుతున్నదన్నారు. ఎన్నికల కమిషన్ జాబితా ప్రకారం 3 కోట్ల 35 లక్షల ఓటర్లు ఉన్నారని.. 18 యేండ్లలోపు వారు ఇంకో 25 శాతం అయినా ఉంటారని.. ఆ లెక్కన రాష్ట్రం మొత్తం జనాభా 4 కోట్ల పైనే ఉంటుందని అన్నారు. కులగణనలో సంఖ్య తక్కువ చేసి చూపారని.. కులగణన అడుగుతారా అనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిపోర్టు తయారు చేసి బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఫిబ్రవరి 4 బీసీలకు పీడ దినమని అన్నారు. అసెంబ్లీ, మండలిలో తమ గొంతు నొక్కారని.. బీసీ రిజర్వేషన్లు పెంచే బిల్లును తెస్తారని ఆశించామని.. కానీ ప్రభుత్వం అలా చేయలేదన్నారు. కాంగ్రెస్ కుట్రపై బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు.

కాంగ్రెస్ మొదటి నుంచీ బీసీల వ్యతిరేకి: గంగుల

కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ బీసీల వ్యతిరేకి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. అసెంబ్లీలో పెట్టిన కులగణన రిపోర్టు ఓ బోగస్ అని అన్నారు. బిహార్ కులగణనను పాట్నా హైకోర్టు కొట్టేసిందని.. బీసీ కమిషన్ ద్వారా సర్వే చేయకుండా ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా చేస్తే కోర్టు కొట్టేసిందని చెప్పారు. రాష్ట్రంలోనూ అలాంటి పొరపాటే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పులతో బీసీ జాతికి అన్యాయం జరిగిందని.. రేవంత్ రెడ్డి తమను బుల్డోజ్ చేశారని ఆరోపించారు. బుల్డోజ్ చేస్తే భయపడటానికి తాము గొర్రెలమా అని ప్రశ్నించారు. సగం ఇండ్లకు సర్వే చేసే వారు వెళ్లనే లేదని.. పదేళ్లకు జనాభా పెరుగుదల 13 శాతం ఉంటుందని.. ఆ లెక్క ప్రకారం 4 కోట్ల 25 లక్షల జనాభా ఉంటుందని స్పష్టం చేశారు. కానీ.. 3 కోట్ల 75 లక్షలకు పరిమితం చేశారని చెప్పారు. దాదాపు 40 లక్షల బీసీ జనాభాను కనుమరుగు చేశారని ఆరోపించారు. ముస్లింలు కలపకుండానే బీసీల జనాభా 56 శాతం పైనే ఉంటుందని.. కేవలం 46 శాతం చూపారని అన్నారు. అన్ని కులాల శాతం పెరిగి బీసీల జనాభా కావాలనే పది శాతం తగ్గించారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేసే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం 2024 వరకు జనాభా 3 కోట్ల 84 లక్షలు ఉందని.. నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం బీసీల జనాభా 56 శాతంగా ఉందన్నారు. కులగణనపై రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. మళ్ళీ సర్వే చేస్తే బీసీల జనాభా 56 శాతం వస్తుందన్నారు. హడావిడిగా అసెంబ్లీ పెట్టి బీసీల కోసం చట్టం చేశారా అని నిలదీశారు. బీఆర్ఎస్ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద మాట్లాడుతూ.. తెలంగాణ సోషల్ జస్టిస్ డే కాదని.. ఇన్ జస్టిస్ డే అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బాగా నటించారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. చట్ట సభల సాక్షిగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి బీసీలను సమాయత్తం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed