స్టార్టప్ ఇండియాతో తెలంగాణలో సరికొత్త వేదికలు

by Mahesh |
స్టార్టప్ ఇండియాతో తెలంగాణలో సరికొత్త వేదికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: భారత్ లో శక్తివంతమైన స్టార్టప్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం జనవరి 16, 2016న స్టార్టప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా భారత్‌లో అత్యంత ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు పెద్ద ఎత్తున యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఫలితంగా నూతన స్టార్టప్ లకు దేశంలో ఇతర ప్రాంతాల కన్నా మన తెలంగాణలోని హైదరాబాద్ ప్రముఖ కేంద్రంగా మారింది. నవంబర్ 30, 2024 నాటికి, మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,54,719 స్టార్టప్‌లను స్థాపించారు. గుర్తింపు పొందిన స్టార్టప్ లలో అత్యధికంగా 48% మంది కనీసం ఒక మహిళా డైరెక్టర్‌ ను కలిగి ఉన్నారు. ఈ స్టార్టప్‌లు 17 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించాయి. 27,459 స్టార్టప్‌లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ (15,851), కర్ణాటక (16,335) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో స్టార్టప్ ల స్థాపనకు అనూకూల వాతావరణం ఉండటంతో చాలా మంది యువ పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారు.

అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం సైతం స్టార్టప్ ల స్థాపనకు ఫండింగ్, ఇతర మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు వివిధ కార్యక్రమాలను తీసుకొచ్చింది. వాటిలో ప్రధానంగా స్టార్టప్ రన్‌వే, నేషనల్ మెంటర్‌షిప్ ప్లాట్‌ఫాం, సీడ్ ఫండ్ సపోర్ట్, స్టార్టప్‌ల ఫండ్స్ (ఎఫ్ ఎఫ్ ఎస్), స్టార్టప్ ఇండియా యాత్ర, స్టార్టప్ మహా కుంభ్ 2024, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వంటి అనేక కార్యక్రమాలు, పథకాలు,విధానాలను తీసుకొచ్చి యువత వ్యాపార వేత్తలు గా మారేందుకు అవకాశాలను కల్పిస్తుంది. పన్ను మినహాయింపులు, పర్యావరణ వ్యవస్థలు, ప్రపంచ స్థాయి స్టార్టప్ ప్రమోషన్, లాంటి కార్యక్రమాలతో పాటు ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ్ 2025 పేరుతో పర్యావరణ వ్యవస్థ ను పరిరక్షించే విధంగా స్టార్టప్ ఐడియాలజీలతో ముందుకు వచ్చే వారి ద్వారా ప్రపంచ స్థాయిలో స్టార్టప్ అనూకూల వాతావరణానికి భారత్ సిద్ధంగా ఉందని, దీని ద్వారా గ్లోబల్ రీచ్ ను సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది.

తెలంగాణలో విజయవంతమైన స్టార్టప్‌లు

స్టార్టప్ ల అనుకూల వాతావరణంతో తెలంగాణ లో స్థాపించిన పలు స్టార్టప్ లు విజయవంతంగా తమ ప్రస్థానానాన్ని కొనసాగిస్తున్నాయి. మరికొన్ని స్టార్టప్ లు కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలకే కాకుండా ఇతర ప్రాంతాలకు విస్తరించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

1.యాక్సియల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ విజయ గాథ

==సైనిక, వాణిజ్య రంగాల్లో సేవలు

తెలంగాణకు చెందిన యాక్సెల్ ఏరో ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ లో ఓ కొత్త ఒరవడిని సృష్టించింది. అనతి కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించి యువతలో స్ఫూర్తిని నింపింది. తెలంగాణలో స్టార్టప్ ల వ్యవస్థకు అనుకూల వాతావరణం ఉందనే సంకేతాలను పంపించింది. యాక్సెల్ ఏరో స్పేస్ ఏవియేషన్ సొల్యూషన్ లో ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్జానాన్ని తీసుకొచ్చింది. అధునాతన నియంత్రణ వ్యవస్థలు, ప్రొపల్షన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ లు ఇందులో ముఖ్యమైనవి. సైనిక, వాణిజ్య రంగాల్లో ఎన్నో సేవలు అందిస్తూ యాక్సిల్ ఏరో స్పేస్ తన ఆవిష్కరణలను సాగిస్తుంది. ఏరో యాక్సిల్ సైనిక రంగంలో వినూత్న ఆవిష్కరణలు, ప్రయోగాలను గుర్తించిన భారత ప్రభుత్వం 2023 ఏరో ఇన్నోవేటివ్ కేటగిరీలో అవార్డును అందజేసింది. యాక్సియల్ ఏరో సిమ్యూలేటర్ అధునాతనమైన మెకానిక్ డిజైన్, మోషన్ టెక్నాలజీ ద్వారా ఎక్స్, వై, జెడ్ అక్షరాలతో 360° డిగ్రీల భ్రమణ సౌలభ్యంతో సాంప్రదాయ ఆవిష్కరణలకు చెక్ పెట్టింది. అంతేకాకుండా, జీఫోర్స్, మోషన్ క్యూయింగ్ అల్గారిథం లను కలిగి ఉండటంతో ఫైటర్ జెట్ లు, హెలికాప్టర్, డ్రోన్ లను వైమానిక పోరాటాల్లో ఉపయోగించుకోవచ్చు. శత్రు సైన్యాల ఫైటర్ జట్ లను సునాయసంగా గుర్తించే అవకాశం ఉంటుంది. తెలంగాణలోని ఒక స్టార్టప్ దేశ రక్షణ రంగంలో కీలకంగా మారి ఎంతో మందికి నూతన స్టార్టప్ లకు ఒక స్ఫూర్తిగా నిలిచిందని చెప్పవచ్చు.

2. స్కైరూట్ ఏరోస్పేస్: తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ తన రంగంలో దూసుకుపోతోంది. స్టార్టప్ ప్రారంభమైన నాటి నుంచి స్టార్టప్ విక్రమ్ సిరీస్ తో ప్రైవేట్ స్పేస్ టెక్ మార్గదర్శకత్వాన్ని అందిస్తూ ఎన్నో విజయాయాలను సాధించింది. స్కైరూట్ ఏరోస్పేస్ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఇవి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాయి. స్కైరూట్ ఏరోస్పేస్ విజయానికి ప్రభుత్వం నుంచి సీడ్ ఫండింగ్, భాస్కర్ వేదికలు ఎంతగానో సహకారాన్ని అందించాయి.

3. ఆటోక్రసీ మెషినరీ: తెలంగాణ కేంద్రంగా పని చేస్తున్న ఆటోక్రసీ స్టార్టప్ కంపెనీ మెషినరీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో ప్రత్యేక పరికరాలను అభివృద్ధి చేయడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసేందుకు పాటుపడుతుంది. ఆటో క్రసీ పరిశ్రమ వేల ఉద్యోగాల కల్పనతో ఎంతో మందిని ఆకర్షిస్తుంది.

ప్రభుత్వ ప్రోత్సాహంతో స్టార్టప్‌ల వృద్ధి...... ఉద్యోగాల కల్పన

స్టార్టప్ ల వృద్ధితో 17 లక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించబడ్డాయి. 2016లో 502 గా ఉన్న స్టార్టప్ ల సంఖ్య 2024 నాటికి 1.54 లక్షలకు పెరిగింది. యూనికార్న్ ల సంఖ్య 2016 లో 11 నుంచి 2024 నాటికి 118 కి పెరిగింది. ఐటీ సేవల రంగంలో 17,618 స్టార్టప్ లు, హెల్త్ కేర్, లైఫ్ సైన్స్ 14,285, విద్యారంగానికి సంబంధించి 9,047 స్టార్టప్ ల వృద్ధి రేటు గరిష్ట స్థాయికి చేరుకుంది. జేమ్ స్టార్టప్ రన్ వే ద్వారా 27,574 స్టార్టప్ ఆన్ బోర్డులోకి వచ్చాయి. వీటి విలువ దాదాపు రూ.32,000 కోట్లుగా ఉంది. నేషనల్ మెంటార్ షిప్ ప్లాట్ ఫాం ద్వారా 2024, నాటికి 1749 గా ఉన్న మెంటార్ లతో 3,022 స్టార్టప్ లు కొత్తగా నమోదు అయ్యాయి. సీడ్ ఫండ్ సపోర్ట్, ఇంక్యూబేటర్లకు రూ.902.74 కోట్ల ద్వారా కొత్తగా 2,583 స్టార్టప్ లు తమ కార్యకలాపాలను మొదలు పెట్టాయి.స్టార్టప్ మహాకుంభ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనికి 14 దేశాల నుండి 48,000 మంది హాజరై, 1,300 మంది ఎగ్జిబిటర్లు, గ్లోబల్ స్థాయిలో స్టార్టప్ అనూకూల వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రదర్శించారు. క్రెడిట్ గ్యారెంటీ పథకం ద్వారా మహిళా రుణగ్రహీతలకు రూ. 24.60 కోట్లో సహా 235 స్టార్టప్ లకు గాను రూ. 555.24 కోట్లను కేంద్ర ప్రభుత్వం అందించింది. స్టార్టప్ బ్రిడ్జ్‌ కార్యక్రమం ద్వారా భారతీయ స్టార్టప్ లను ప్రపంచ మార్కెట్ తో అనుసంధానించేందుకు 21 దేశాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించింది.'పిచ్ ఫార్వర్డ్' ద్వారా మహిళలకు మద్దతుగా నిలుస్తూ వివిధ వర్క్ షాపులను నిర్వహించింది. దీని ద్వారా 22 రాష్ట్రాల్లోని 1,400లకు పైగా మహిళా స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రభావితమయ్యారు. స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న కార్యక్రమాల ద్వారా యవత పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Advertisement

Next Story