లిక్కర్ కేసుపై బీజేపీ అధిష్టానం ఆరా.. బీఆర్ఎస్‌కు ఎదురయ్యే చిక్కులపై ఫోకస్!

by GSrikanth |   ( Updated:2023-02-28 02:25:02.0  )
లిక్కర్ కేసుపై బీజేపీ అధిష్టానం ఆరా.. బీఆర్ఎస్‌కు ఎదురయ్యే చిక్కులపై ఫోకస్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై బీజేపీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఈ కేసు బీఆర్ఎస్ మెడకు ఎలా చుట్టుకుంటుంది? దాని నుంచి ఆ పార్టీకి అనుకూల, ప్రతికూల పరిస్థితులేంటి? అనే అంశాలపై దృష్టి సారిస్తోంది. ఈ అంశం ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సింపతీ పొందే అవకాశాలున్నాయా? వంటి అంశాలపై జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా ఈ సమయంలో బీజేపీని పొలిటికల్‌గా జనంలోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలపై తెలంగాణకు చెందిన నేతలతో చర్చించనుంది. అందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన జాతీయ కార్యవర్గ సభ్యులకు అమిత్ షా కార్యాలయం నుంచి ఫోన్ వెళ్లినట్లు సమాచారం. షా కార్యాలయం నుంచి కాల్ వచ్చిన వెంటనే పలువురు నేతలు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కాగా మరికొందరు మంగళవారం ఉదయం వెళ్లనున్నారు. కాగా మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షాతో వారు భేటీ కానున్నారు.

హస్తిన నుంచి వచ్చిన పిలుపు మేరకు జాతీయ కార్యవర్గ సభ్యులు ఢిల్లీ బాట పట్టారు. అయితే ఇంత సడెన్‌గా పిలిచిన నేపథ్యంలో లిక్కర్ స్కాంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు కాషాయ శ్రేణులు చర్చ జరుగుతోంది. షా కార్యాలయం నుంచే మీటింగ్ ఉంది రావాలని పిలుపు వచ్చిందంటే తెలంగాణపై ఇంకేదైనా వ్యూహరచన చేశారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి కమలనాథులు వీధి సభలను ఎంతో సీరియస్‌గా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే సోమవారం స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ముగింపు సభలను నిర్వహించాలని కాషాయ పార్టీ తొలుత ప్లాన్ చేసుకుంది. ఆ సభలను సైతం వదిలేసి వెంటనే రావాలని ఆదేశాలు రావడంతో అంత ముఖ్యమైన అంశం ఏంటనేది రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కాషాయ పార్టీ అగ్రనేతలు. అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి జైలుపాలయ్యారు. ఈ అంశంతో బీజేపీపై ఇప్పటికే బీఆర్ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణకు చెందిన ఇంకెవరైనా ఈ కేసులో అరెస్టయితే సింపతీని క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ ఎదురుచూస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వాటిని తిప్పికొట్టి స్కామ్ చేశారు కాబట్టే వారు జైలుకు వెళ్లారనే వాస్తవాలను ప్రజలకు వివరించి కాషాయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అమిత్ షా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇటీవల వారం రోజుల పాటు తెలంగాణలో పర్యటించిన బీజేపీ నేత సునీల్ బన్సల్ రాష్ట్రంలో పరిస్థితులపై, పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక నివేదిక రూపొందించారు. సైలెంట్ గాఉన్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు లాంటి నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

రాష్ట్ర నాయకత్వంతో విబేధిస్తున్న అసమ్మతి నేతలతో కూడా బన్సల్ సమావేశమై.. అభిప్రాయాలను తీసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదికను సునీల్ బన్సల్ సిద్ధం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపైనా అమిత్ షా సమావేశంలో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. నేతల మధ్య సమన్వయం.. పనివిభజన అంశాలపై చర్చించే అవకాశముందని చెబుతున్నారు. ఢిల్లీలో ఆప్ నేత సిసోడియో అరెస్ట్ నేపథ్యంలో తెలంగాణలో జరగబోయే తదుపరి పరిణామాలు అంశంపై కీలకంగా నేతలు చర్చించే అవకాశముంది. మొత్తానికి అమిత్ షా సమావేశంలో ఎలాంటి సలహాలు ఇస్తారు? కమలనాథులు వాటిని ఎలా ఆచరణలో పెడతారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

Also Read...

బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై KCR అనూహ్య నిర్ణయం.. 5 స్థానాలు వారికే..?!

Advertisement

Next Story

Most Viewed