DK Aruna: బతుకమ్మ ఆడాలంటే.. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలా?

by Gantepaka Srikanth |
DK Aruna: బతుకమ్మ ఆడాలంటే.. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బతుకమ్మ ఆడాలంటే.. కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలా? అంటూ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఘాటు విమర్శలు చేశారు. బతుకమ్మ ఆడేందుకు లా అండ్ ఆర్డర్‌కు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద శుక్రవారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకకు డీకే అరుణ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సాయంత్రం 6 గంటల వరకే భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలకు అనుమతులున్నాయంటూ పోలీసువు నిలిపివేయడంపై డీకే అరుణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక నియంత పోయాడనుకుంటే రేవంత్ ఆయనను మించిన మరో నియంత తయారయ్యాడని ఆమె ఫైరయ్యారు. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ ఆడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా? అని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చినోళ్లమని వాళ్లు పోతే.. ఇచ్చింది తామే అని చెప్పుకునే కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆమె పేర్కొన్నారు.

వారు తెలంగాణ సంస్కృతిని గౌరవించే తీరు ఇదేనా? అని డీకే అరుణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేసీఆర్‌ను మించిన నియంతపాలన సాగుతోందని ఫైరయ్యారు. బతుకమ్మ ఆడుకునేందుకు అభ్యంతరం చెప్పే ప్రభుత్వం ఇక్కడ నడుస్తోందంటే సిగ్గుపడాలంటూ చురకలంటించారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బతుకమ్మ ఆడుకుంటే తప్పేంటని, ఇలాంటి ఆంక్షలు పెట్టేందుకే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారా? అని ఆమె ఫైరయ్యారు. మిస్టర్ రేవంత్ రెడ్డి తప్పుడు నిర్ణయాలతో అమ్మవారి అగ్రహానికి గురికావొద్దంటూ ఘాటుగా హెచ్చరించారు. బతుకమ్మ ఆడితే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని నిలదీశారు. గతంలో కేసీఆర్ భాష సరిగ్గా లేదనుకున్నామని, ఇప్పుడు అంతకంటే అధ్వాన్నంగా రేవంత్ మాటలు ఉన్నాయని విమర్శలు చేశారు. ఇటీవల సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఆ స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా? అంటూ ఆమె ధ్వజమెత్తారు. రేవంత్ ది నోరా.. మోరా..? అంటూ అరుణ ఫైరయ్యారు.

ఇకపోతే సినీ నటి సమంత, అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు సరికావని డీకే అరుణ పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్న సురేఖ ఇలా మాట్లాడటం అభ్యంతరకరమన్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆమె మాటలు ముమ్మాటికీ తప్పేనని చురకలంటించారు. ఒక మహిళ వ్యక్తిగత విషయాలు మాట్లాడటం సరికాదన్నారు. విడాకులు వారి పర్సనల్ మ్యాటర్ అని, దానిపై రాజకీయాలు ఎందుకని నిలదీశారు. కేటీఆర్‌పై కొండాసురేఖ వ్యాఖ్యలు కూడా సరికావన్నారు. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటమే తప్పు అని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందో సురేఖ ఆలోచించుకోవాలని సూచించారు. ప్రభుత్వంలో అధికారిక హోదాలో ఉన్నారంటే మరింత జాగ్రత్తగా మాట్లాడాలన్నారు. పాలన చేతగాక కాంగ్రెస్ నేతలు రాజకీయాలను భష్టు పట్టిస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed