గూండాల దాడులకు బీజేపీ భయపడదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్

by Satheesh |   ( Updated:2023-11-29 17:49:37.0  )
గూండాల దాడులకు బీజేపీ భయపడదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదేళ్ల పాలనలో చెప్పుకునేలా చేసిందేమీ లేకపోవడంతో ప్రజలు కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను నమ్మకపోవడంతో ఆ పార్టీలో అసహనం పెరిగిందని, దీంతో రోజురోజుకూ ప్రజాదరణ పొందుతున్న బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. సంఘ విద్రోహశక్తులకు వ్యతిరేకంగా పోరాడే చరిత్ర బీజేపీదని, గుండాల దాడులకు భయపడదని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. బాన్సువాడ క్యాంపు కార్యాలయంలో నిద్రిస్తున్న బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణతో పాటు బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ గుండాలు దాడి చేయడాన్ని కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతోపాటుగా లక్ష్మీనారాయణ డ్రైవర్‌పై భౌతికదాడులకు దిగడం హేయనీయమని మండిపడ్డారు.

వైఫల్యాలతో జనం తిరగబడుతుంటే.. వారి సమస్యలను పరిష్కరించకుండా.. బీజేపీపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని వారు మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే బీఆర్ఎస్ నాయకులు భౌతిక దాడులకు దిగుతున్నారని ఇరువురు ధ్వజమెత్తారు. కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రజా క్షేత్రంలో బీజేపిని నేరుగా ఎదుర్కోవాలి తప్పా.. ఇలాంటి దాడులు చేయించడం పిరికిపంద చర్య అని వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే ఈ దాడులు జరుగుతున్నాయనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశాడు. బాన్సువాడ నియోజకవర్గంలో గెలుపు బీజేపీదే అని తెలిసి బీఆర్ఎస్‌లో వణుకు మొదలైందని వారు పేర్కొన్నారు. దాడి చేసి గెలవాలని చూడటం పిరికిపంద చర్యగా డీకే అరుణ పేర్కొన్నారు.

ఓటమి భరించలేక దాడులకు తెగబడుతున్నారని ఆమె విమర్శలు చేశారు. ఇంటికెళ్లి గుండాయిజం చేయడతంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వచ్ఏ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని, బీఆర్ఎస్ నేతల ఆటలు ఇక సాగవని ఆమె స్పష్టంచేశారు. బాధ్యతగల అసెంబ్లీ స్పీకర్ అయిన పోచారం శ్రీనివాసర్ రెడ్డి యెండల ఇంటిపైకి వెళ్లి దాడి చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఆమె ఫైరయ్యారు. బీజేపీ అభ్యర్థి ఇంటిపై వెళ్లి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణకు భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed