BIG News: నాడు మౌనం.. నేడు ఆగ్రహం! ‘మెఘా’ విషయంలో బీఆర్ఎస్ తీరు భిన్నం

by Shiva |
BIG News: నాడు మౌనం.. నేడు ఆగ్రహం! ‘మెఘా’ విషయంలో బీఆర్ఎస్ తీరు భిన్నం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మెఘా కంపెనీ విషయంలో బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మూడేండ్ల క్రితం కన్నెపల్లి పంపు హౌజ్ నీటిలో మునిగినప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఆ ఘటనపై మౌనంగానే ఉండిపోయింది. ప్రస్తుతం సుంకిశాల ఘటన విషయంలో మాత్రం కాంట్రాక్టు కంపెనీ తీరును తప్పుబడుతున్నది. దానిని బ్లాక్ లిస్టులో పెట్టాలని స్వయంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నాడు ఆ కంపెనీపై ప్రశంసలు కురిపించిన నేతలు.. నేడు అదే సంస్థపై విమర్శలు చేయడం ఆశ్చర్యం ఉందంటూ సొంత పార్టీ నేతల్లోనే గుసగుసలు మొదలయ్యాయి.

దాదాపు రూ.800 కోట్లు నష్టం!

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి, అన్నారం పంప్ హౌజ్‌ల కాంట్రాక్టు పనులు చేపట్టింది మెఘా కంపెనీయే. రెండేండ్ల క్రితం (జూలై 2022) వచ్చిన వరదల వల్ల అవి నీటిలో మునిగిపోయాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ నిర్దేశించిన స్థాయి వరద రాకుండానే రెండు పంపు హౌజ్‌లు నీటిలో మునిగిపోవడానికి ప్రధాన కారణం డిజైన్ లోపమేనన్న విమర్శలు వచ్చాయి. అందులోని బహుబలి మోటర్లు సైతం పనికిరాకుండా పోవడంతో పాటు వాటి చుట్టూ నిర్మించిన రక్షణ గోడలు సైతం కూలిపోయాయి. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.800 కోట్ల నష్టం జరిగిందని టాక్. ఇంత జరిగినా నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు మెఘా కంపెనీపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. పైగా వాటిని పరిశీలించేందుకు వెళ్లిన విపక్ష లీడర్లను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ప్రస్తుతం అదే సంస్థ నిర్మించిన సుంకిశాల విషయంలో మాత్రం హంగామా చేస్తుండటం, సర్కారుపైనే నిందలు వస్తుండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.

నాడు సపోర్ట్..

కన్నెపల్లి, అన్నారం పంప్‌హౌజ్‌లు మునిగిన సమయంలో సదరు ఆ కాంట్రాక్టు సంస్థపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో డిమాండ్ వచ్చినా గులాబీ లీడర్లు పట్టించుకోలేదు. పైగా ప్రభుత్వ పరంగా ఆ సంస్థకు సపోర్టుగా నిలిచారనే ఆరోపణలు వచ్చాయి. కానీ ప్రస్తుతం సుంకిశాల పనులు చేస్తున్న అదే మెఘా సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలని గులాబీ లీడర్లు డిమాండ్ చేయడం వెనుక అంతర్యం ఏంటనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి బీఆర్ఎస్ హాయంలోనే సుంకిశాల నిర్మాణ పనులను మెఘా కంపెనీ దక్కించుకున్నది. అప్పటి నుంచి పనులు కొనసాగుతున్నాయి. కానీ బీఆర్ఎస్ లీడర్లు పదే పదే ఆ సంస్థను ఎటాక్ చేయడం వెనుక ఎదో బలమైన కారణం ఉండొచ్చనే చర్చ జరుగుతున్నది.

నాడు, నేడు అదే అధికారులు

గులాబీ పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు విదేశీపెట్టుబడలను ఆహ్వానించేందుకు ఐటీ, ఇండస్ట్రీ మంత్రి హోదాలో కేటీఆర్ పలు సార్లు విదేశాల్లో పర్యటించారు. ఆయన వెంట ఐటీ సెక్రెటరీ జయేశ్ రంజన్ సైతం ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో సమయంలోనూ జయేశ్ రంజన్ ఐటీ సెక్రెటరీ హోదాలో పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు ఫెక్ అంటూ గులాబీ లీడర్లు విమర్శలకు తెరలేపారు. మరి గత ప్రభుత్వంలో ఐటీ సెక్రెటరీ హోదాలో ఉన్న జయేశ్ రంజన్ ఆధ్వర్యంలో చేసుకున్న ఒప్పందాలు సంగతి ఏంటీ? అవి కూడా నకిలివేనా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

బ్లాక్ మెయిల్ స్ట్రాటజీ?

తమ హాయం నుంచి కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలు, ఐఏఎస్ అధికారులపై బీఆర్ఎస్ ఎటాక్ చేయడం వెనుక బ్లాక్ మెయిల్ స్ట్రాటజీ ఉందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారం కోల్పొయిన తర్వాత సదరు కాంట్రాక్టు సంస్థలు, అధికారులు తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదని అక్కసుతోనే విమర్శలు చేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. పదే పదే విమర్శలు చేస్తే సదరు అధికారులు కొంతలో కొంతైన తమ పట్ల పాజిటివ్‌గా ఉంటారనే ఆశలో గులాబీ లీడర్లు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.

Advertisement

Next Story