- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Bhu Bharathi: ‘సర్వే మ్యాప్’తో భూ వివాదాలకు చెక్..! ‘భూ భారతి’లో ట్రాన్సాక్షన్స్ కంపల్సరీ
దిశ, తెలంగాణ బ్యూరో: ‘భూ భారతి’ ద్వారా రాష్ట్రంలోని భూములను వివాదరహితంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం భూ లావాదేవీల సమయంలో సర్వే మ్యాప్ నిబంధనను చట్టంలో పొందుపర్చింది. అయితే దీనిపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికభారం, సమయభావం అవుతుందని చెబుతున్నారు. సర్వేయర్ల కొరత నేపథ్యంలో దీన్ని అమలు చేయడంతో ఇబ్బందులు తలెత్తుతాయంటూ పేర్కొంటున్నారు. అయితే భవిష్యత్తులో ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ సమస్య పరిష్కారానికి, భూ వివాదాలను చెక్ పెట్టేందుకు సర్వే మ్యాప్ నిబంధన ఎంతో ఉపకరిస్తుందని రెవెన్యూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వే మ్యాప్ రూపొందించడానికి, సర్వేయర్ల కొరత తీర్చడానికి ప్రత్యామ్నాయాలను అమలు చేయడం సాధ్యమేనని పేర్కొంటున్నారు.
ఇది తెలంగాణ విధానమే
భూ భారతి బిల్లులో ముఖ్యంగా మూడు రాష్ట్రాల విధానాన్ని అనుసరించారు. అందులో తెలంగాణ ఆర్వోఆర్- 1948 చట్టం ప్రధానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కాకముందే ఈ చట్టాన్ని రూపొందించారు. అప్పుడు ప్రతి భూ లావాదేవీకి సర్వే మ్యాప్ పెట్టాలని నిర్ణయించారు. అప్పట్లో క్రయ విక్రయాల సంఖ్య తక్కువ అయినా.. ఇలాంటి ఫ్యూచరిస్టిక్ అంశాన్ని అమలు చేసిన ఘనతపై అప్పటి తెలంగాణ ప్రభుత్వాన్ని కొనియాడాల్సిందే. నిజాం హయాంలోనూ అమలైన భూ పరిపాలన కూడా ప్రశంసించదగిందే. అలాగే కర్ణాటక ఆర్వోఆర్ చట్టంలో ఉన్నట్లుగా సెక్షన్ 5, 7 లో మ్యుటేషన్ కు ముందే సర్వే మ్యాప్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్నట్లుగా పట్టాదారు పాసు పుస్తకంలోనూ సర్వే మ్యాప్ ని పొందుపరిచేటట్లుగా సెక్షన్ 10లో పేర్కొన్నారు. సేల్ డీడ్ లో జత చేసిన సర్వే మ్యాప్, ఆర్వోఆర్ రికార్డుల్లోనూ ఉంటుంది. దీంతోపాటు పాసు పుస్తకంలోనూ ప్రింట్ అవుతుంది. దీని ద్వారా ఏదైనా భూమిని కొనుగోలు చేసే వ్యక్తి సర్వే చేయించుకుంటారు. అప్పుడే ఏవైనా వివాదాలు ఉన్నా తెలిసే అవకాశాలు ఎక్కువ. దాంతో పాటు హద్దులు పక్కా అవుతాయి.
ఫ్యూచర్ లో ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ కు చెక్
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రికార్డులు, వాస్తవ భూ విస్తీర్ణానికి తేడాలు ఉన్నాయి. ఏదైనా సర్వే నంబరులో 20 ఎకరాల విస్తీర్ణముంటే.. 25 ఎకరాలకు పైగా క్రయవిక్రయాలు జరిగాయి. కచ్చితంగా అంతే విస్తీర్ణంపై లావాదేవీలు జరిగిన గ్రామాల సంఖ్య శూన్యం. చేతిలో పట్టా, రికార్డుల్లో విస్తీర్ణం ఉన్నా.. భూమి లేదు. కొందరికి భూమి ఉన్నా.. వారి దగ్గర పట్టాలు లేవు. ఇక అసైన్మెంట్ పట్టాదారుల పరిస్థితి మరీ దారుణంగా. రాజకీయ ప్రాబల్యం కోసం లేని విస్తీర్ణానికి పట్టాలు ఇచ్చిన ఉదంతాలు అనేకం. ఒకే భూమిని రెండేసి సార్లు పంపిణీ చేశారు. అలా చాలా మంది రికార్డుల్లో ఉండడం ద్వారా ఆర్ఎస్ఆర్ డిఫరెన్స్ సమస్య ఉత్పన్నమైంది. ఈ వివాదాలకు ఏదో ఒక రోజు చెక్ పడాలంటే ఇప్పటి నుంచి అమ్మకాలు సాగించే భూముల సర్వే జరగాలి. అదే ఈ భూ భారతి ద్వారా చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
వాస్తవ విస్తీర్ణం మేరకే అమ్మకాలు
పట్టాదారు పాసు పుస్తకం ఆధారంగానే సేల్ డీడ్ లేదా గిఫ్ట్ డీడ్/ఏజీపీఏ. అందులోని కొంత విస్తీర్ణాన్ని విక్రయించగానే ఆ మేరకు తొలగించలేదు. దాంతో అదే విస్తీర్ణాన్ని మరొకరికి విక్రయించిన ఉదంతాలు ఎన్నెన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఎకరం రూ.కోట్లు పలుకుతున్న ప్రాంతాల్లోనే ఇలాంటి అవినీతి దందా వరదలా ప్రవహించింది. సేల్ డీడ్పొందడం, మ్యుటేషన్ చేయించుకొని పట్టాదారు పాసు పుస్తకాలు సంపాదించుకోవడం పరిపాటిగా మారింది. కానీ క్షేత్ర స్థాయిలో నిజంగా ఎంత భూమి ఉన్నదన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సబ్ రిజిస్ట్రార్లు, తహశీల్దార్లు సేల్ డీడ్, మ్యుటేషన్లు చేశారు. సాగు భూమిగానే కాకుండా దాన్నే ప్లాట్లుగానూ రిజిస్ట్రేషన్లు చేసిన ఉదంతాలు కోకొల్లలు. ఇప్పటికీ ప్లాట్లుగా మారిన భూములు ధరణి పోర్టల్ లో వ్యవసాయ భూములుగా కొనసాగుతున్నాయి.
ఆఖరికి రైతుబంధు సొమ్మును కూడా తెగ తింటున్న పెద్దోళ్లు ఉన్నారు. అవి ఏనాడో లేఅవుట్లుగా చేసి అమ్మేశారని.. ఇవిగో సేల్ డీడ్లు అంటూ ఆధారాలు చూపించినా వారికే మద్దతు పలుకుతున్న తహశీల్దార్లు, కలెక్టర్లు కూడా దర్శనమిస్తున్నారు. రికార్డుల్లో నుంచి తొలగించకుండా, జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలను రద్దు చేయకుండా చోద్యం చూస్తున్నారు. ఇప్పుడా కథలకు చెక్ పడనున్నది. భూమి ఉంటేనే రిజిస్ట్రేషన్. ఆ భూమికి హద్దులు, కొలతలతో కూడిన సర్వే సబ్ డివిజన్ మ్యాప్ ఉంటేనే సేల్ డీడ్/మ్యుటేషన్ అని భూ భారతి చెప్తున్నది. కర్ణాటకలో కావేరి పేరిట చేపట్టిన ప్రాజెక్టులో రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే, సబ్ డివిజన్ మ్యాప్స్ విధానం సక్సెస్ అయ్యింది. తెలంగాణలోనూ విజయవంతమవుతుంది. రికార్డుల్లో భూమి ఉంటే, వాస్తవానికి భూమి లేని వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు.
సర్వే ఎవరు చేస్తారు?
రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉన్న మాట వాస్తవమే. అయితే ఆ సర్వేయర్లే ఇది చేయాలన్న నిబంధన ఏమీ లేదు. ప్రతి ప్లాట్ సేల్ డీడ్ లోనూ స్కెచ్ మ్యాప్ జత చేస్తున్నారు. ఇదంతా డాక్యుమెంట్ రైటర్లే చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేసేందుకు అర్హత కలిగిన వారు వెయ్యి మందికి పైగానే సర్వేయర్లు ఉన్నారు. వారంతా టెక్నికల్ ఎడ్యుకేషన్ కలిగినవారే. డాక్యుమెంట్ రైటర్లకు ఎలాంటి అవకాశం కల్పించారో.. అలాగే లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా చాన్స్ ఇవ్వడం ద్వారా కొరత తీరుతుందని రెవెన్యూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అభిప్రాయపడ్డారు. సర్వే చేసి మ్యాప్ గీసి ఇచ్చేందుకు భూ భారతి చట్టానికి రూల్స్ ఫ్రేం చేసేటప్పుడు నిర్దిష్టమైన ఫీజును పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా, విస్తీర్ణాన్ని బట్టి నామినల్ ఫీజు పెట్టాలి. అధికంగా వసూలు చేస్తే యాక్షన్ తీసుకునేటట్లు నిబంధనలను రూపొందించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే లైసెన్డ్ సర్వేయర్లకు ఉపాధి లభిస్తుంది. మరోవైపు ఏదైనా భూమిని కొనుగోలు చేసి, ఆ తర్వాత ఇబ్బందులు పడే కంటే ముందే సర్వే చేయించుకోవడం ద్వారా కొనుగోలుదారు హక్కులకు భరోసా ఉంటుంది.
‘వీఆర్వో/వీఆర్ఏ’లకు ఆ బాధ్యతలు వద్దు..
ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను స్వీకరించింది. సర్వేయర్లుగా పని చేయాలనుకునే వారికి కూడా ఆహ్వానం పలికింది. కేవలం భూ భారతి బిల్లులో పేర్కొన్న సర్వే మ్యాప్ ల కోసమే ఒకరిని నియమించడం ద్వారా వారికి చేతి నిండా పని ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రోజూ సర్వే చేసే పనులేం ఉండవు. అందుకే వీఆర్వో, వీఆర్ఏలందరినీ గ్రామ పరిపాలన అధికారులుగానే నియమించడం సరైందని నిపుణులు చెబుతున్నారు. వీరిలో కొందరికి సర్వే బాధ్యతలు అప్పగించడం ద్వారా నాణ్యమైన సేవలు అందవన్న అభిప్రాయం కూడా ఉంది. భూమి కొలిచి మ్యాపులు గీసే నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రమే ఈ పనులను అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ప్రభుత్వం సర్వేయర్లుగా వీరిని నియమించే అంశాన్ని పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుత సర్వేయర్ల నుంచి కూడా వ్యతిరేకత ఎదురవుతున్నది. పైగా చట్టం అమల్లోకి రాగానే సర్వే మ్యాప్ ల విధానం రాదు. దీనికి సంబంధించిన వ్యవస్థలను ఏర్పాటు చేసిన తర్వాతే అమలవుతుంది.
ఎప్పుడెప్పుడు సర్వే మ్యాపులు అవసరం..
* సెక్షన్ 3(3) ప్రకారం భూమి అమ్మకం, బహుమతి, తనఖా, మార్పిడి, పంపకాలు, రిజిస్ట్రేషన్/మ్యుటేషన్ చేసేటప్పుడు విక్రేత సమర్పించాలి.
*సెక్షన్7(1) ప్రకారం వీలునామా, వారసత్వ మ్యుటేషన్లు.
*సెక్షన్ 8(1) ప్రకారం వివిధ పద్ధతుల ద్వారా భూమి హక్కులు పొందినప్పుడు మ్యుటేషన్ పొందడానికి సర్వే సబ్ డివిజన్ మ్యాపులను ఆర్డీవోకు సమర్పించాలి.