చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.. ప్రభుత్వ సపోర్ట్‌పై బత్తిని ఫ్యామిలీ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
చేపమందు పంపిణీకి ఏర్పాట్లు పూర్తి.. ప్రభుత్వ సపోర్ట్‌పై బత్తిని ఫ్యామిలీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మృగశిర కార్తె రోజున చేపలు తినడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విధంగా మృగశిర కార్తె నాడు చేపలు తినడం వల్ల ఆస్తమా, గుండె జబ్బుల రోగులకు ఉపశమనం దొరుకుతుందని నమ్ముతారు. అలాగే.. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌కు చెందిన బత్తిని కుటుంబం వారు చేప మందు ‘ప్రసాదం’ పంపిణీ చేస్తుండటం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. చేప మందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు బత్తిని గౌడ్స్ కుటుంబసభ్యులు సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బత్తిని అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ.. దాదాపు 20 ఏళ్లుగా మా కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తె నాడు పంపిణీ చేస్తున్నామని అన్నారు.

వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాల్గు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు. ఈ సేవ మా కుటుంబ పెద్దలకు 190 క్రితం ఓ మునీశ్వరుడు బోధించారని చెప్పారు. అప్పటినుండి నిస్వార్థంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు తరతరాలుగా ఇస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వాలన్నీ తమకు పూర్తి సహకారాన్ని అందిస్తూ వస్తున్నాయని అన్నారు. జూన్ 8వ తేదీన ఉదయం 11 గంటల నుండి మరునాడు ఉదయం 11 గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్‌లో నిర్విహించే చేప ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రెస్‌మీట్‌లో బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు అమర్నాథ్ గౌడ్, కుటుంబ సభ్యులు, శివ శంకర్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్, శివ శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, మౌళి గౌడ్, రోషన్ గౌడ్‌తో పాటు అగ్రవాల్ సేవాదళ్ కన్వీనర్ అజిత గుప్తా, కైలాష్ కేడియా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed