Bandi Sanjay: మూసీ పేరుతో కాంగ్రెస్ చేయబోయేది ఇదే.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |
Bandi Sanjay: మూసీ పేరుతో కాంగ్రెస్ చేయబోయేది ఇదే.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నానా తంటాలు పడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేక ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందని ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపడాన్ని, పేదల ఇండ్లను కూల్చాలనుకోవడాన్ని బీజేపీ వ్యక్తిరేకిస్తోందన్నారు. మూసీ విషయంలో ప్రభుత్వ వైఖరని నిరసిస్తూ గురువారం బండి సంజయ్ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే మూసి ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారని, మూసీ సుందరీకరణ పేరుతో పాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప మూసీ పరిస్థితి ఏ మాత్రం మారలేదని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన శుక్రవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాకు మూసీ బాధితులు, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

బీఆర్ఎస్ కు కాళేశ్వరం, కాంగ్రెస్ కు మూసీ:

మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరతీస్తున్నదని రూ.1 లక్ష 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలనుకుంటోందన్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నదన్నారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ‘మూసీ పునరుజ్జీవం’ పేరుతో మరో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎం మాదిరిగా వాడుకోవాలని చూస్తుండటం బాధాకరం అన్నారు. ఈ అప్పుల భారమంతా తిరిగి వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపైనే పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతి కుటుంబంపై రూ.1 లక్షా 29 వేల అప్పు

నాబార్డ్ సంస్థ ఇచ్చిన ‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే’ నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ ప్రజలేనని ఈ సందర్భంగా బండి సంజయ్ చెప్పారు. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని, ఇది జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువ అన్నారు. .రాష్ట్రంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయిని జాతీయ సగటు 52 శాతం కుటుంబాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీ మూసీ ప్రక్షాళన కు వ్యతిరేకం కాదని, తెలంగాణ రాష్ట్రం, ప్రజల ఆర్థిక పరిస్థితి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో మళ్లీ లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed