ధరణి ఫలితంగా 20 నెలల్లో 20 మందికి పైగా బలి: బక్క జడ్సన్

by Satheesh |   ( Updated:2023-02-08 12:30:37.0  )
ధరణి ఫలితంగా 20 నెలల్లో 20 మందికి పైగా బలి: బక్క జడ్సన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ధరణి పోర్టల్ వల్ల రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ విమర్శించారు. ఎక్కడా చూడని చిత్ర విచిత్రాలు ధరణిలో కనబడుతున్నాయని అన్నారు. ధరణి కారణంగా ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను రైతులు తమ సొంత భూములుగా చెప్పుకునే పరిస్థితి లేదన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్, సీసీఎల్ఏ కమీషనర్, ఎండీ తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్‌లకు ధరణిలో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయిత గిరిబాబుతో కలసి మెమోరాండం అందించారు. ధరణిలో సమస్యలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం ఈ రెండేళ్లలో ధరణిలో వివిధ చార్జీల పేరుతో రూ. 1000 కోట్ల ఆదాయాన్ని వెనకేసుకుందని ఆరోపించారు.

గతంలో వారసులకు భూమి సక్సెషన్ (ఫౌతి) చేసేందుకు ఎలాంటి ఫీజు ఉండేది కాదని.. ఇప్పుడు ఎకరానికి రూ. 2,500 ఫీజు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న తప్పులను సవరించడానికి 10 లక్షల దరఖాస్తులు వచ్చినా వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఏ పాలసీ తీసుకు వచ్చినా అందులో ఏదో ఓ కుట్ర ఉంటోందని ధ్వజమెత్తారు. ధరణిలో గ్రామాలకు గ్రామాలే కనిపించడం లేదని మెదక్, మహబూబాబాద్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, జిల్లాల పరిధిలో 34 గ్రామాలు ధరణిలో కనిపించడం లేదని ఆరోపించారు.

ధరణి ఫలితంగా దాన్ని అమల్లోకి తెచ్చిన 20 నెలల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ధరణి తీసుకువచ్చే క్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్‌ను ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. దేశానికి చేసిన సేవలను గుర్తించి మాజీ సైనికులకు, ఫ్రీడమ్ ఫైటర్స్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అసైన్డ్ చేసిన భూములకు బీఆర్ఎస్ సర్కార్ రెడ్ మార్క్ పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏదైనా భూమి తీసుకోవాలనుకంటే అందుకు సంబధించిన సర్వే నెంబర్లను ధరణి వెబ్ సైట్ నుంచి ఉద్దేశపూర్వకంగా తొలగిస్తోందనే వాదన ఉందన్నారు. రాష్ట్రంలో 22 లక్షల రెవెన్యూ రికార్డుల అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వమే వివిధ సందర్భాల్లో చెప్పిందని.. ఫలితంగా భూ యజమానులు లక్షల కొద్దీ ఫీజు రూపంలో చెల్లించి సవరణ చేసుకోవాల్సి వస్తోందన్నారు. తప్పు ప్రభుత్వానిది అయితే శిక్ష రైతులకా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed