MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత

by M.Rajitha |
MLC Kavitha : సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్భలంతోనే దాడులు : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం(BRS Party Office)పై కాంగ్రెస్ కార్యకర్త దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత(MLC Kavitha) ఖండించారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ద్వేషం, హింస‌, విధ్వంసం ఉంద‌ని కవిత మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రోద్భలంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ గూండాలు రెచ్చిపోతున్నార‌ని విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ నాయకులు ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడడం దుర్మార్గమ‌ని స్పష్టం చేశారు. ఈ దాడిని పిరికిపంద చ‌ర్యగా అభివ‌ర్ణించారు.

రాహుల్ గాంధీ(Rahul Gandhi) వ‌ల్లించే మొహబ్బత్ కి దుకాన్ ఒక బూటకమ‌ని తేట‌తెల్లమైందని, అది విద్వేషం, హింసను ప్రేరేపించే దుకాణమ‌ని కవిత ధ్వజ‌మెత్తారు. ఇలాంటి హింసా రాజ‌కీయాల‌ను తెలంగాణ తిర‌స్కరిస్తుందని, హింస‌కు, విద్వంస‌క‌ర చ‌ర్యల‌కు తెలంగాణలో తావు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ త‌న‌ యువ‌జ‌న విభాగాన్ని గూండాల‌ విభాగంగా తీర్చిదిద్దుతోందని మండిప‌డ్డారు. యాదాద్రి భువనగిరిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంపై ఎన్‌ఎస్‌యూఐ, యువ‌జ‌న కాంగ్రెస్‌ జరిపిన దాడి వారి అసలు రంగును బట్టబయలు చేసిందని, కాంగ్రెస్ విష సంస్కృతికి ఇదొక నిద‌ర్శనమ‌ని చెప్పారు.

ఇలాంటి సిగ్గుమాలిన కాంగ్రెస్ పార్టీకి ప్రజ‌లు బుద్దిచెబుతార‌ని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక‌ర్తలు, నాయ‌కుల జోలికి వ‌స్తే ఊరుకోబోమ‌ని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ మూకలపై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని, వారిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed