TRT ఇప్పట్లో లేనట్టే! భర్తీకి ఎలక్షన్స్‌తో లింక్

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-16 02:44:59.0  )
TRT ఇప్పట్లో లేనట్టే! భర్తీకి ఎలక్షన్స్‌తో లింక్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీచర్ కొలువుకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఐదేళ్లుగా డీఎస్సీ లేకపోగా.. కలల జాబ్ కోసం చూసేవారు లక్షల్లో ఉండొచ్చు. ఇప్పట్లో టీచర్ల భర్తీ ప్రక్రియ లేకపోగా.. అసెంబ్లీ ఎన్నికలకు ప్రభుత్వం ముడివేసినట్టు తెలిసింది. ఎప్పుడు ఎన్నికలకు వెళ్తే అప్పుడే నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం. అప్పటివరకు టీచర్ల భర్తీకి మోక్షం లేదని ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. రెండోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత టీచర్ రిక్రూట్ మెంట్ చేయలేదు. ఆరు నెలల కిందట హడావుడిగా టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) నిర్వహించి రిజల్ట్ ఇచ్చారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని అభ్యర్థులు కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని మరి చూస్తున్నారు. కానీ సర్కార్ ఎన్నికలకు వెళ్లే ముందే నోటిఫికేషన్ జారీ చేసి, రాజకీయంగా లబ్ధిపొందే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో టీఎస్పీఎస్సీ ద్వారా టీచర్లను భర్తీ చేయగా, ఈసారి డీఎస్సీ(డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ) ద్వారా నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఎడ్యుకేషన్ డిప్టార్ట్ మెంట్‌ను ఆదేశించింది. దీంతో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ప్రభుత్వం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.


5 లక్షల మంది..

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సుమారు 5 లక్షల మంది ఎదురు చూస్తున్నారు. ఆరు నెలల కిందట టెట్ రాశారు. దీంతో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందనే ఆశతో కోచింగ్‌కు వెళ్తున్నారు. చాలామంది గ్రామాల నుంచి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ సిటీల్లో అద్దెకు గదులు తీసుకుని ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఆశావహులు టీచర్ కొలువు కొట్టిన తర్వాతే మ్యారేజ్ చేసుకోవాలని, ముహుర్తాలను కూడా వాయిదా వేసుకుంటున్న పరిస్థితి ఉంది.

గుర్తించి ఏడాది పూర్తి

టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యం చేసిందనే విమర్శలు వచ్చాయి. దీంతో సర్కారు గతేడాది ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కలు తీసింది. త్వరలో సుమారు 50 వేల జాబ్‌లను భర్తీ చేస్తామని ప్రకటించింది. అందులో టీచర్ పోస్టులు 13 వేలు ఉన్నట్టు వెల్లడించింది. ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌ను మాత్రం పక్కన పెట్టేసింది. పెద్ద సంఖ్యలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేస్తే రాజకీయ ప్రయోజనం ఉండదని, అందుకే ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

అసలు ఖాళీలెన్నీ?

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని టీచర్ల భర్తీ ఖాళీలపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 13 వేలు ఖాళీలను గుర్తించినట్టు అధికారులు చెబుతున్నారు. కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణలో 18,588 ఖాళీలు ఉన్నట్టు వెల్లడించారు. దీంతో రాష్ట్రసర్కార్ టీచర్ల ఖాళీల సంఖ్యను తక్కువగా చూపిందని విమర్శలు వస్తున్నాయి.

కొత్త టీచర్లు వచ్చేనా?

ఇప్పటికిప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తే వచ్చే ఏడాది 2023–24 అకాడమిక్ ఇయర్‌కు కొత్త టీచర్లు అందుబాటులోకి వస్తారు. లేకపోతే ఆ తర్వాత వచ్చే ఏడాదికే రావొచ్చని విద్యాశాఖ అధికారులు అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ముందుగా నోటిఫికేషన్ ఇవ్వాలంటే టీచర్ల రెగ్యులైజేషన్ చేయాలి. పిల్లల ఎన్‌రోల్‌మెంట్‌లో పనిచేస్తున్న టీచర్లకు రేషియోలో తేడాలు ఉన్నాయి. వాటిని సవరించిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయొచ్చని ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పేర్కొన్నారు.

Also Read....

సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారా..? అయితే ఈ వార్తను ఒక్కసారి చదవండి

Advertisement

Next Story

Most Viewed