- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తొమ్మిదేళ్ల తర్వాత భద్రాద్రి రామయ్య కల్యాణానికి CM.. అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

దిశ, భద్రాచలం: దక్షిణ అయోధ్య భద్రాద్రి పుణ్యక్షేత్రంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభిత కళ్యాణ మండపంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015, 2016 సంవత్సరాలలో జరిగిన సీతారాముల కళ్యాణానికి మాత్రమే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామి వారికి పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చారు. అప్పటి నుంచి నేటి వరకూ భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకలలో కేసీఆర్ పాల్గొనలేదు. ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రులు ఒక సారి ప్రభుత్వ సీఎస్ దంపతులు, మరోసారి కేసీఆర్ మనమడు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. 9 సంవత్సరాల తర్వాత నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రామయ్య కల్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు భద్రాద్రి రానున్నారు. స్వామి వారి కళ్యాణం తిలకించేందుకు వచ్చిన భక్తులతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోతుంది.
భారీ బందోబస్తు ఏర్పాటు
రామయ్య కల్యాణానికి ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు రానున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణంలో శనివారం నుండే భారీ బందోబస్తు నిర్వహించారు. మొత్తం 1800 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో ప్రత్యేక భద్రతా బలగాలు ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
అందరికీ తలంబ్రాలు, ప్రసాదం అందేలా...
భద్రాద్రిలో నేడు జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం తిలకించడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు భద్రాద్రి తరలి వచ్చారు. మొత్తం లక్ష మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా భక్తులందరికీ స్వామి వారి కళ్యాణ తలంబ్రాలు, ప్రసాదం అందజేయడానికి 80 తలంబ్రాల కౌంటర్లు, 19 ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశారు.
24 సెక్టార్లు.. 32 వేల మంది కూర్చుని వీక్షించేలా..
రామయ్య కళ్యాణం జరిగే మిథలా స్టేడియంను 24 సెక్టార్లుగా విభజించారు. ప్రతి సెక్టార్‌కు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ 24 సెక్టార్లలో ఫ్రీ గ్యాలరీలో మొత్తం 32 వేల మంది భక్తులు కూర్చుని స్వామి వారి కళ్యాణం తిలకించేలా ఏర్పాటు చేశారు.
సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం
భద్రాద్రిలో జరిగే స్వామి వారి ఎదుర్కోలు, కళ్యాణం, పట్టాభిషేకం ఉత్సవాలను భద్రాచలం వచ్చి ప్రత్యక్షంగా వీక్షించలేని సుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వీక్షించేందుకు సమాచార ప్రచార శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేశారు. వీరు అందించే లింక్ ద్వారా పలు టీవీ చానళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీంతో ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా స్వామి వారి కళ్యాణం చూసే సౌకర్యం కల్పించారు.
భక్తులకు సకల సౌకర్యాలు
కళ్యాణం తిలకించేందుకు భద్రాద్రి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా వసతి, త్రాగునీరు, అత్యవసర చికిత్స కొరకు ప్రథమ చికిత్స కేంద్రాలు, సమాచారం తెలుసుకునేందుకు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్, వేగంగా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ, ముఖ్యమైన కూడళ్లలో మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.
సీఎం పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ లోని ఇంటి వద్ద నుండి బయలుదేరి బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 8.45 నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్ లో భద్రాచలం బయలుదేరుతారు.10 గంటలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో దిగి సారపాక ఐటీసీ గెస్ట్ హౌస్ కి చేరుకొని 20 నిమిషాలు విశ్రాంతి తీసుకుని 10.30 కు భద్రాచలం బయలుదేరుతారు.10.40 నుండి 11 గంటల వరకూ భద్రాచలం స్వామి వారిని దర్శించుకుంటారు.అనంతరం 11.10 గంటల నుండి 12.30 గంటల వరకు మిథిలా స్టేడియంలో జరిగే స్వామివారి కళ్యాణం లో పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.12.30 కు భద్రాచలం నుంచి బయలుదేరి సారపాక లోని సన్న బియ్యం లబ్దిదారుని ఇంట్లో భోజనం చేస్తారు. అనంతరం ఐ టీ సి గెస్ట్ హౌస్ కి చేరుకొని 45 నిమిషాలు విశ్రాంతి అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.