Anvesh Reddy: జన్యుమార్పిడి పంటలతో ప్రమాదం

by Gantepaka Srikanth |
Anvesh Reddy: జన్యుమార్పిడి పంటలతో ప్రమాదం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జన్యుమార్పిడి పంటలతో ప్రమాదం పొంచి ఉన్నదని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో జన్యు మార్పిడి పంటలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వివిధ రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. స్వయం శక్తి, రైతుల జ్క్షానం, ప్రకృతి పరిరక్షణతో కూడి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. జన్యు మార్పిడి పంట ప్రోత్సాహక విధానాన్ని రద్దు చేసి, బయో సెప్టీ ఫాలసీని అమలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. కిసాన్ కాంగ్రెస్ నాయకుడు నల్లమల వెంకటేశ్వరరావు, కోదండరెడ్డిలు మాట్లాడుతూ.. కేంద్ర పర్యావరణ శాఖ మాజీ మంత్రి జైరాం రమేష్​ బీటీ వంకాయ విషయంలో 2010 లో ప్రజలతో సంప్రదింపులు జరుపగా, కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం లభించిందన్నారు.

వనరుల దోపిడీ, రసాయన కాలుష్యంతో కూడిన ఆహార ఉత్పత్తికి చెక్ పెట్టాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఈ జన్యు మార్పిడి విత్తనాల వలన రైతుకు ఉన్న విత్తన స్వాతంత్రం కోల్పోవడంతో పాటు విత్తనాలు కార్పొరేట్ చేతుల్లోకి వెళ్తాయని పునరుద్ఘాటించారు. జన్యు మార్పిడి పంటల మూలంగా ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై దేశవ్యాప్తంగా రైతులతో పాటు వినియోగదారులను సైతం కలుపుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక సంఘం ప్రతినిధులు కవిత, కే.రవి, తమిళనాడు రైతు సంఘం ప్రతినిధులు పీఎన్ పాండ్యన్, సుందర విమల నందన్, కర్ణాటక రైతు సంఘం ప్రతినిధి బాలకృష్ణన్, కేరళ రైతు సంఘం ప్రతినిదులు కేవీ బిజు, ఉష, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం నాయకులు సాగర్, భారతీయ కిసాన్ సంఘం ప్రతినిధి శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed