‘భూ భారతి’ అమలుపై ప్రకటన.. ఆ పండగ నుంచే ప్రారంభం

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-17 14:39:56.0  )
‘భూ భారతి’ అమలుపై ప్రకటన.. ఆ పండగ నుంచే ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో చిన్నాభిన్నమైన రెవెన్యూ, గ్రామ రెవెన్యూ వ్యవస్థల బలోపేతానికి భూ భారతి 2025 చట్టం ఉగాది నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి అన్నారు. ఇప్పటికే గ్రామ పాలనాధికారులుగా 10,954 పోస్టులు మంజూరయ్యాయన్నారు. సోమవారం సీసీఎల్ఏ కార్యాలయం ఆవరణలోని ఉద్యోగుల జేఏసీ కార్యాలయంలో వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలోకి వచ్చిన తర్వాత వీఆర్వోల సమస్యలు కూడా పరిష్కారమవుతాయన్నారు. భూ భారతి చట్టం అమల్లోకి రాగానే గ్రామ పాలన అధికారులు బాధ్యతల్లోకి వస్తారన్నారు. రెవెన్యూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ తన ధ్యేయమన్నారు. గత ప్రభుత్వ పాలనలో 25 వేల మంది రెవెన్యూ ఉద్యోగుల పోస్టులు రద్దయి, చెట్టుకొకరు పుట్టకొకరయ్యారన్నారు. గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థను తీసుకురావడంతో పాటు 11 వేల పోస్టులు క్రియేట్ చేయించుకోగలిగామన్నారు.

Read More..

మహిళల అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు


స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టులను 39 నుంచి 50 కి క్యాడర్ స్ట్రెంత్ పెంచుకున్నామన్నారు. అలాగే 33 సెలెక్షన్ గ్రేడ్ పోస్టులు వచ్చాయన్నారు. కొత్త డివిజన్లు, మండలాల్లో 361 పోస్టులు మంజూరీ చేయించిన ఘనత తమదేనన్నారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 330 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు నెలవారీ జీతాలు కూడా అందాయన్నారు. ఆఫీస్ సభార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ వరకు పదోన్నతులు ఇప్పించుకోగలిగినట్లు గుర్తు చేశారు. గత పది సంవత్సరాలుగా కోల్పోయిన హక్కులన్నీ కొద్ది కాలంలోనే సాధించుకోవడంలో సఫలీకృతులమైనట్లు తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. ఆఫీస్ సబాడినేట్స్ నుంచి డిప్యూటీ కలెక్టర్స్ వరకు రెవెన్యూ శాఖలో పదోన్నతులు సాధించుకోవడం, 33 సెలెక్షన్ గ్రేట్ పోస్టులు సాధించడం, గ్రామ పాలనాధికారుల పోస్టుల్ని ప్రభుత్వం ఆమోదింప చేయడానికి లచ్చిరెడ్డి నాయకత్వంలో సాధించుకోవడం శుభ పరిణామంగా తెలిపారు.

అస్తవ్యస్తమైన రెవెన్యూ శాఖను బలోపేతం చేసుకోవడంలో అత్యంత కీలకంగా కృషి చేసినట్లు కొనియాడారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థ బలోపేతంలో పూర్వ వీఆర్వోలను ఆప్షన్ పద్ధతిలో తీసుకోవడంలో కూడా సఫలీకృతం అవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో పూర్వ వీఆర్వోల సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు ఇవ్వాలని కార్యవర్గం తీర్మానించింది. ఆర్వోఆర్ 2025 యాక్టు రూపకల్పన, రెవెన్యూ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, డిప్యూటీ కలెక్టర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణలను గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి లక్ష్మీనరసింహులు, అసోసియేట్ అధ్యక్షులు చంద్రయ్య, పరమేశ్వర రావు, కోళ్ల శ్రీనివాస్, కోశాధికారి కోనబోయిన ప్రసాద్, అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
Next Story