ఉధృతంగా మారిన ఏఎన్ఎమ్‌ల 'చలో అసెంబ్లీ'.. ఎక్కడికక్కడే అరెస్టులు చేసిన పోలీసులు

by Satheesh |   ( Updated:2023-02-09 15:30:22.0  )
ఉధృతంగా మారిన ఏఎన్ఎమ్‌ల చలో అసెంబ్లీ.. ఎక్కడికక్కడే అరెస్టులు చేసిన పోలీసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో పనిచేస్తున్న 3500 కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఏఎన్ఎమ్‌లను జీవో నెంబర్ 16లో చేర్చి రెగ్యులర్ చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'చలో అసెంబ్లీ' ఉధృతంగా మారింది. బుధవారం నుండే రాష్ట్రవ్యాప్తంగా ఏఎన్ఎమ్‌ల ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగింది. గురువారం జిల్లాల నుంచి వచ్చిన ఏఎన్ఎమ్‌లు నారాయణగూడ‌లోని ఏఐటీయూసీ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని తీవ్ర ఘర్షణ వాతావరణంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజు, ఉప ప్రధాన కార్యదర్శి ఎం. నరసింహలు మాట్లాడుతూ.. అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేస్తూ ప్రజలందరికి తలలో నాలుకలాగా ఏఎన్ఎంలు వ్యవహరిస్తారని తెలిపారు. ప్రజారోగ్య కార్యక్రమాల అమలు, మాతాశిశువు మరణాల సంఖ్య తగ్గుదల, జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఆరోగ్య రంగంలో 3వ స్థానం సాధించుటకు, ముఖ్య కారణం రెండవ ఏఎన్ఎంలే అని వెల్లడించారు.

కొవిడ్-19ని అదుపు చేసే క్రమంలో వ్యాధిపై పూర్తి అవగాహన కూడా రాని రోజుల్లో.. వ్యాధి కట్టడికి అవసరమైన సేవలను అందిస్తూ ముందువరుసలో నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ క్రమంలోనే ఎంతోమంది ఏఎన్ఎంలు మరణించినప్పటికీ ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందలేదని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే ఏఎన్ఏంల సమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఏఎన్ఎమ్‌ల సర్వీసులను క్రమబద్దికరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రెండవ ఏఎన్ఎం యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తోట రామాంజనేయులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల మమత, ప్రధాన కార్యదర్శి గాండ్ల మధురిమా, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయ కుమారి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు సరళ, రేణుక, అరుణ, ఉపాధ్యక్షులు పద్మ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

Also Read..

హైదరాబాద్‌లో మరో కొత్త తరహా మోసం.. జలకన్య పేరు చెప్పి..

Advertisement

Next Story