KCRకు డబుల్ షాక్.. Ponguletiతో పాటు బీజేపీలోకి మరో ముఖ్య నేత?

by GSrikanth |   ( Updated:2023-01-09 07:32:04.0  )
KCRకు డబుల్ షాక్.. Ponguletiతో పాటు బీజేపీలోకి మరో ముఖ్య నేత?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలు ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తారని తొలుత ప్రచారం జరిగినా తాజాగా ఆ సభను ఖమ్మంకు మార్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈనెల 18వ తేదీన సీఎం కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభకు నిర్ణయించగా ఇదే రోజు కేసీఆర్‌కు షాకిచ్చేలా బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు ప్రచారం గుప్పుమంటోంది. ఖమ్మం బీఆర్ఎస్‌లో గత కొంత కాలంగా అసంతృప్తి రాగాలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నేతల వైఖరిపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్టు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు ఆయన బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ ఖమ్మంలో సభ నిర్వహిస్తుండగానే అదే రోజున పొంగులేటి అమిత్ షాతో భేటీ కాబోతున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. ఇటీవల పొంగులేటి చేస్తున్న వరుస కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన అనుచరులంతా పోటీ చేస్తారని, అలాగే తనకు పదవులు లేకున్నా ప్రజల ఆశీస్సులు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చగా మారాయి. అయితే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారని అందులో భాగంగానే తన అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. జనవరి 10 నుంచి మండలాల్లో పర్యటించబోతున్నారని ఆ తర్వాత 18న అమిత్ షాతో భేటీ అయి తాను పార్టీలోచేరే అంశంపై నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

పొంగులేటి బాటలోనే మాజీ మంత్రి?

పొంగులేటి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేరు తెరపైకి వస్తోంది. బీఆర్ఎస్ అధిష్టానం తీరుపై తుమ్మల గత కొంత కాలంగా అసంతృప్తితో ఉన్నారని ఆయన కూడా పార్టీ మారేందుకు అదును కోసం చూస్తున్నారనే ప్రచారం ఉంది. ఇటీవల ఆయన తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం హాట్ టాపిక్ అయింది. టీడీపీ నేతల సభల్లో హాజరు కావడం చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పొంగులేటి పొలిటికల్‌గా బిగ్ డిసిషన్ తీసుకుంటే అదే బాటలో తుమ్మల ప్రయాణిస్తారా? లేక బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అనేది ఆసక్తిగా మారింది. అయితే ఈ నెల 18వ తేదీన గులాబీ బాస్ ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో కేసీఆర్ సభకు హాజరు నేతల వైఖరిని కూడా స్పష్టం చేసే అవకాశాలు ఉన్నాయి.

హాట్ హాట్‌గా ఖమ్మం పాలిటిక్స్:

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో తిరిగి పుంజుకావాలని చూస్తున్న టీడీపీ ఇటీవల ఖమ్మంలోనే సభ నిర్వహించింది. ఈ మీటింగ్ కు చంద్రబాబు హాజరై ఖమ్మం నా గుమ్మం అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. మరో వైపు బీజేపీ సైతం ఇక్కడి కీలక నేతలను తమ వైపు ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోందనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. మరో వైపు బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు రోజుకో ట్విస్ట్ తీసుకుంటున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కు ఎదురు గాలి వీచింది. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ లో కుమ్ములాటలకు ఆస్కారం ఉందనే అభిప్రాయంతో బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలతో కాషాయ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఖమ్మం పాలిటిక్స్ లో అసలేం ఏం జరుగుతోందనే చర్చ పొలిటికల్ హీట్ పెంచుతోంది.

Also Read...

తెలంగాణకు Supreme Court నోటీసులు

బీజేపీలోకి Ponguleti Srinivas Reddy చేరిక దాదాపు ఖరారు?

Advertisement

Next Story

Most Viewed