హౌజ్ కీపర్లతో కూలీ పనులు!

by Javid Pasha |
హౌజ్ కీపర్లతో కూలీ పనులు!
X

దిశ, సిటీబ్యూరో : అంబేడ్కర్ పుట్టిన రోజున సాగర తీరాన ప్రతిష్టించిన అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తన జీవితం ధన్యమైందంటూ సాక్ష్యత్తు సీఎం కేసీఆర్ సంతృప్తిని వ్యక్తం చేస్తుండగా, అక్కడి నుంచి కూతవేటు దూరంలో ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని హౌజ్ కీపింగ్ విభాగంలోని దళిత సామాజికవర్గానికి చెందిన మహిళా ఉద్యోగులతో అధికారులు కూలీ పనులు చేయించారు. దీంతో సమసమాజ స్థాపన, దళిత సంక్షేమం, దళిత అభ్యున్నతి అంటూ పాలకులు, అధికారులు జపించే మంత్రం కేవలం మాటలకే తప్పా, చేతలకు పనికిరాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసులను శుభ్రపర్చటం, ఆఫీసులోని చెత్తను సేకరించి బిన్లలో వేయటం వంటి పనులు చేసేందుకు కాంట్రాక్టు ప్రాతిపదికన సుమారు 53 మంది ఉద్యోగులను నియమించారు. వీరిలో ఎక్కువ శాతం మంది మహిళలే. అందులో దళిత సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువ.

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని బిల్డింగ్ మెయింటనెన్స్ విభాగం అధికారుల్లోని కొందరు అక్రమార్కులు కార్పొరేషన్‌లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభాన్ని సైతం ఏమాత్రం పట్టించుకోకుండా తరుచూ ఏదో ఓ ఫ్లోర్‌లో రెనోవేషన్ పనులు చేయిస్తుంటారు. దీంతో పాటు ఈ మహిళా కార్మికులతో అధికారులు, అటెండర్లు తాము తిన్న ప్లేట్లను కూడా కడిగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కడిగేందుకు నిరాకరిస్తే సూపర్ వైజర్లకు ఫిర్యాదులు చేసి, జీతాలు కట్ చేయిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. చెప్పిన పనులు చేయకుంటే జీతాలు కట్ చేస్తామని బెదిరించి, ఈ పనులను చేయిస్తున్నట్లు పలువురు మహిళలు వాపొయారు.

అడ్డుకున్న బీఎంఎస్ నేతలు..

ఇటీవలే టెండర్లు ఖరారు చేసిన అప్పగించిన ఓ రెనోవేషన్ పనులకు సంబంధి ఏర్పడిన మట్టి కుప్పలను శుక్రవారం హౌజ్ కీపింగ్ సెక్షన్‌లోని కొందరు దళిత మహిళలతో మొయిస్తుండగా, అప్పుడే అంబేడ్కర్ జయంతి కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్తున్న భాగ్యనగర్ మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, జనరల్ సెక్రటరీ టి.కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏ.శంకర్, ఖైరతాబాద్ జోన్ ప్రెసిడెంట్ సుదర్శన్, సికింద్రాబాద్ జోన్ అధ్యక్షుడు కడారి రాజు, జీహెచ్ఎంసీ సెక్రటరీ జయకృష్ణలు గమనించి, కాంట్రాక్టుకు అప్పగించిన ఈ పనులను హౌజ్ కీపింగ్‌లోని మహిళా ఉద్యోగులతో ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు చెప్పినందుకు తాము చేస్తున్నామని మహిళా ఉద్యోగులు వాపోయారు. దీంతో బీఎంఎస్ నేతలు సంబంధిత ఇంజినీర్‌తో మాట్లాడగా, హౌజ్ కీపింగ్ కార్మికులు మట్టి పనులు కూడా చేయాల్సిందేనని సమాధానమిచ్చినట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారంపై సోమవారం కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని బీఎంఎస్ నేతలు తెలిపారు.

కాంట్రాక్టర్ ఎవరు? ఆయనపై ఎందుకంత ప్రేమ?

రెనొవేషన్ పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఎవరు? ఆయనపై అధికారులకెందుకంత ప్రేమ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబేడ్కర్ జయంతి రోజు సెలవు దినమే అయినా ఓ కాంట్రాక్టర్ చేయించాల్సిన పనిని ఎందుకు హౌజ్ కీపింగ్ మహిళా ఉద్యోగులతో చేయించారన్న చర్చ జరుగుతుంది. బిల్డింగ్ మెయింటనెన్స్‌లో ఏళ్లతరబడి విధులు నిర్వహిస్తూ, కొంతకాలం క్రితం అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ఓ అధికారి, మళ్లీ పైరవీ చేసుకుని, జీహెచ్ఎంసీలోకి వచ్చి వాలాడు. ఈ అధికారి నిత్యం ఏదో చోట రెనోవేషన్ చేయాలంటూ కమిషనర్‌కు ఫైల్ పెట్టడం, మంజూరీ తీసుకోవటం చాలా ఈజీగా జరిగిపోతుంది.

Advertisement

Next Story