పంజాగుట్ట PS మొత్తం సిబ్బందిపై వేటు.. సీపీ సంచలన నిర్ణయం

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-31 07:26:58.0  )
పంజాగుట్ట PS మొత్తం సిబ్బందిపై వేటు..  సీపీ సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో/డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేస్తూ డిసిషన్ తీసుకున్నారు. హోంగార్డుల నుంచి ఇన్ స్పెక్టర్ల వరకు ఒకే దఫాలో 86 మందిని మార్చి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరిని సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వారి స్థానంలో నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కొత్తగా 82 మంది సిబ్బందిని పంజాగుట్టకు నియామించారు. అయితే పంజాగుట్ట పోలీసులపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడికి సంబంధించిన కేసు వ్యవహారంతో పాటు కీలకమైన విషయాలు బయటకి పొక్కడంపై సీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని ఆరోపణలపై ఈ బదిలీ వేటు వేశారు. కాగా ఓ స్టేషన్ పరిధిలోని సిబ్బంది అందరిని మార్చివేయడం ఇదే తొలిసారి.

డిపార్ట్‌మెంట్‌కే తలవంపులు తెచ్చేలా..

నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిటీ లా అండ్ ఆర్డర్ విషయంలో అత్యంత కీలకమైన స్టేషన్. అయితే గతేడాది డిసెంబర్ 23న పంజాగుట్టలోని ప్రజాభవన్ వద్ద యాక్సిడెంట్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌‌ను తప్పించేందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గారావు, బోధన్ సీఐ ప్రేమ్ కుమార్‌లు ప్రయత్నించారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో సీఐ ప్రేమ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా దుర్గారావు పరారీలో ఉన్నారు. గతంలో ఈ స్టేషన్ దేశంలోనే బెస్టాఫ్ త్రీలో ఒకటిగా నిలిచి అరుదైన గుర్తింపును సాధించిన చరిత్ర కలిగిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇటీవల కాలంలో డిపార్ట్‌మెంట్‌కే తలవంపులు తెచ్చేవిధంగా ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో స్టేషన్ మొత్తాన్ని ప్రక్షాళన దిశగా సీపీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed