జిల్లా అభివృద్ధికి కృషి : మంత్రి సీతక్క

by Sridhar Babu |
జిల్లా అభివృద్ధికి కృషి : మంత్రి సీతక్క
X

దిశ, ఉట్నూర్ : గిరిజన గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అన్నారు. శనివారం ఉట్నూర్ లో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, భవనాల ప్రారంభోత్సవం కార్యక్రమాలకి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి సీతక్క ఉట్నూర్ కి రావడంతో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ విఠల్, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ అదిలాబాద్ పార్లమెంట్ ఇన్ చార్జి ఆత్రం సుగుణక్క, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ స్వాగతం పలికారు.

మండలంలో పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శంభూగూడ నుండి శివనూర్ గ్రామం వరకు 3 కోట్ల 24 లక్షల రూపాయలతో, లక్కారం నుండి చింతగూడ వరకు 8 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేశారు. అక్కడి నుండి గొండ్ గూడ జీ పంచాయతీలో రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన భవనాన్ని మంత్రి ప్రారంభించి పంచాయతీ సెక్రటరీని సన్మానించారు. అనంతరం మండలంలోని శ్యాంపూర్ లో రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కోళ్లఫామ్, చెక్ డ్యాం, పొలంబాట అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 124 స్వయం సహాయక సంఘాలకు 7 కోట్ల 59 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కు అందించి, ఐటీడీఏ ఆధ్వర్యంలో ఫేస్ 1లో ట్రైకార్ సబ్సిడీ కింద 7.5 లక్షల చెక్కును ఇంద్రవెల్లి ఎఫ్పీఓ సభ్యులకు అందజేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమంతాలు, అన్నప్రాసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానన్నారు. ఆశ్రమ, గురుకుల తదితర పాఠశాలల్లో నూతన మెనూ ప్రకారం భోజనాన్ని వడ్డించాలన్నారు. భోజనం విషయంలో నాణ్యత పోలిస్తే సహించేది లేదన్నారు. పౌస్టికాహారాన్ని అందించి విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. చిన్నారులకు మంత్రి స్వయంగా పౌష్టిక ఆహారాన్ని తినిపించి, గర్భవతులకు శ్రీమంతపు కానుకలు అందజేశారు. అంతకుముందు సెల్పీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే బొజ్జుతో కలిసి ఫొటో దిగారు. మంత్రి రాకతో పలువురు నాయకులు మంత్రిని కలిసి వినతి పత్రాలను అందించారు. ఉట్నూర్ సాహితీ వేదిక ఆధ్వర్యంలో కవి జాదవ్ మురళీ రచించిన మహా నినాదం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story