దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం

by Sridhar Babu |
దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆదిలాబాద్ ఎంపీ జి.నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అమృత్ పథకంలో భాగంగా రూ.19 లక్షలతో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి శనివారం కేఆర్కే కాలనీలో వారు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి పలు సందర్భాల్లో విన్నవించినట్టు తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అమృత్ పథకంకు సంబంధించిన నిధుల కోసం ఆదిలాబాద్ ఎంపీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆ నిధులు వస్తే పట్టణంను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన అనంతరం నాణ్యతా ప్రమాణాలతో పనులను చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

అమృత్ పథకంలో నిధులు మంజూరు చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఎంపీ నగేష్ మాట్లాడుతూ నీటి సమస్యతో పాటు మురుగు కాలువలు నిర్మించేందుకు అమృత్ పథకంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఎంపిక చేసినట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.320 కోట్ల నిధులు మంజూరు చేయించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రభుత్వమిచ్చిన సమయానికంటే ముందే నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ హైమద్, ఈఈ గంగాధర్, నాయకులు అశోక్ రెడ్డి, సాయి, రాము, స్వప్న, సురేఖ, రాజు, నాందేవ్, మున్నా, స్వప్నిల్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed