న‌ల్లసూరీళ్లు బీఆర్ఎస్‌ను మెచ్చలే

by Mahesh |
న‌ల్లసూరీళ్లు బీఆర్ఎస్‌ను మెచ్చలే
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: తెలంగాణ ఉద్యమ స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీ త‌ప్ప వేరే పార్టీ ఇక్కడ అడుగుపెట్టవ‌ద్దంటూ సింగ‌రేణి కార్మికులు తీర్మానాలు చేసుకున్నారు. ఉద్యమ పార్టీగా ఆ పార్టీని ఆద‌రించి అక్కున చేర్చుకున్నారు. తెలంగాణ వాణిని వినిపించే పార్టీగా, సింగ‌రేణిలో త‌మ హ‌క్కుల కోసం పోరాడే పార్టీగా గుండెల‌కు హ‌త్తుకున్నారు. ఆ పార్టీకి అనుబంధంగా ఏర్పాటు చేసిన తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘాన్ని సైతం రెండుసార్లు గెలిపించారు. తెలంగాణలోని ఆరు జిల్లాలు కొమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, బెల్లంపల్లి, చెన్నూరు, ఆసిఫాబాద్, రామగుండం, మంథని, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాలు కోల్ బెల్ట్‌లోనే ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గాల లెక్కల్లో చూస్తే ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ స్థానాలలోని చాలా ప్రాంతాలలో సింగరేణి ఓటర్ల ప్రభావం ఉంటుంది.

ఎమ్మెల్యే ఎన్నిక‌లు మొద‌లు

సింగరేణిలో ప్రస్తుతం సుమారు 42 వేల మంది కార్మికులున్నారు. వీరితో పాటు 20 వేల మంది వరకు కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నారు. 60 వేల మందికి పైగా పెన్షనర్లున్నారు. ఈ నేపథ్యంలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలలో సింగరేణి కార్మిక కుటుంబాల ఓట్లు కీలకం. అయితే, గ‌తంలో వీరంతా బీఆర్ఎస్ వైపే ఉండేవారు. కానీ, వారంతా ఇప్పుడు ఉన్న ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేయ‌డం లేద‌నేది చాలా స్పష్టంగా క‌నిపిస్తోంది. ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో సింగ‌రేణి ప్రాంతంలో ఉన్న 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో 11 నియోజ‌క‌వర్గాల్లో ఏ ఒక్క చోట కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెల‌వ‌లేదు. కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సింగ‌రేణి ప్రభావం పాక్షికం కాబ‌ట్టి అక్కడ కోవ‌ల‌క్ష్మి గెలిచింది. మంచిర్యాల మ‌రికొన్ని చోట్ల ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మూడో స్థానానికి ప‌రిమితం అయ్యారు.

గుర్తింపు ఎన్నిక‌ల్లో బొక్కాబోర్లా...

ఇక‌, సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అనుబంధ సంఘ‌మైన తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం రెండు మార్లు గెల‌వగా, ఈసారి జరిగిన ఎన్నిక‌ల్లో బొక్కాబోర్లా ప‌డింది. ఈ యూనియన్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొదట పోటీ చేయమని, ఆ తర్వాత చేస్తామని ప్రకటించడం తో కార్మికులు ఆ యూనియన్ కనీసం గుర్తించలేదు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి సింగరేణి కార్మికులు దూరం అవుతున్నారని రాజ‌కీయ ప‌రిశీకులు చెబుతున్నారు. నిజానికి కార్మికుల హక్కుల సాధనలో టీబీజీకేఎస్ చొరవ చూపించి విజయం సాధించింది. ఎన్నో ఏండ్లుగా జాతీయ కార్మిక సంఘాలు దూరం వారసత్వ ఉద్యోగాల కల్పనతో కార్మికులు ఆ యూనియన్ కు దగ్గరయ్యారు. ఇక రూ.10 లక్షలు సొంతింటి కోసం వడ్డీలేని రుణం, సకల జనుల సమ్మె వేతనాలు, లాభాల వాటా గణనీయంగా పెంచడంతో కార్మికుల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మంచి గుర్తింపు పొందింది.

ఎంపీ ఎన్నిక‌ల్లో ద‌య‌నీయ స్థితి..

ఇక ఎంపీ ఎన్నిక‌ల్లో సైతం ఆ పార్టీ ద‌య‌నీయ ప‌రిస్థితి ఎదుర్కొంది. సింగ‌రేణి ఉన్న అన్ని చోట్ల ఆ పార్టీకి మూడో స్థానం ద‌క్కిందంటే ప‌రిస్థితి అర్ధం చేసుకోవ‌చ్చు. ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో 20 వేల పై చిలుకు ఓట్లు కాంగ్రెస్‌కు రాగా, బెల్లంప‌ల్లి, చెన్నూరు, మంచిర్యాల‌లో సైతం కాంగ్రెస్ ఆధిక్యత సాధించింది. ఇక బీజేపీ రెండోస్థానం ద‌క్కించుకోగా బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానానికే ప‌రిమితం కావాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా పెద్దప‌ల్లి స్థానంలో పోటీ చేసిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సింగ‌రేణి కార్మికుడు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న కార్మిక క్షేత్రంలోనే ఎక్కువ‌గా ప్ర‌చారం చేశారు. కార్మికుల క‌ష్టాలు త‌న‌కు తెలుసంటూ కార్మికుల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అయినా ఆయ‌న‌ను కార్మికులు నమ్మలేదు. సింగ‌రేణి ప్రాంతంలో ఆ పార్టీకి వ‌చ్చిన ఓట్లే రుజువు చేస్తున్నాయి. బెల్లంప‌ల్లి నుంచి మొద‌లుకుని కొత్తగూడెం వ‌ర‌కు అన్ని ప్రాంతాల్లో అదే దుస్థితి.

నేతలు, కార్మిక సంఘం ప్రతినిధులే..

ఒక‌ప్పుడు బీఆర్ఎస్‌కు అండ‌గా నిల‌బ‌డిన వారే దూరం కావ‌డానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు కార‌ణ‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు. సింగ‌రేణిలో కార్మిక సంఘ నేత‌లు చేసిన అవినీతితో కార్మికులు విసిగిపోయారు. మ‌రీ ముఖ్యంగా కార్మికుల బ‌దిలీలు, క్వార్టర్ల కేటాయింపు, ప‌దోన్నతులు ఇలా అన్ని ర‌కాలుగా రేటు ఫిక్స్ చేసి మ‌రీ దందా సాగించారు. ప్రతి ప‌నికి ఇంత అని కార్మికుల ద‌గ్గర ముక్కుపిండి వ‌సూలు చేశారు. ఇక చాలా చోట్ల అధికారంతో ప‌లువురు మ‌హిళ‌ల ప‌ట్ల లైంగిక వేధింపుల‌కు దిగారు. రామ‌గుండంలో ఓ మ‌హిళ వేధింపులు భ‌రించ‌లేక తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌ను చెప్పుతో కొట్టింది. ఇలా చెప్పుకుంటూపోతే చాలా ర‌కాలుగా కార్మికులు బ్బందులు ప‌డ్డారు. ఇప్పుడు ఆ వ్యవ‌హారం అంతా ఓట్ల రూపంలో బ‌య‌ట‌ప‌డుతోంది. సింగ‌రేణి కార్మికులు, వారి కుటుంబాలు, వారితో అనుబంధం ఉన్న వారంతా బీఆర్ఎస్‌కు ఎదురుతిరిగారు. ఫలిత‌మే భుజాల మీద ఎత్తుకున్న జ‌న‌మే ఆ పార్టీని అథఃపాతాళానికి తొక్కేశారు.

Advertisement

Next Story