సింగరేణి ఎన్నికలు: బెల్లంప‌ల్లి రీజియ‌న్‌లో ఏఐటీయూసీ క్లీన్ స్వీప్‌

by Mahesh |
సింగరేణి ఎన్నికలు: బెల్లంప‌ల్లి రీజియ‌న్‌లో ఏఐటీయూసీ క్లీన్ స్వీప్‌
X

దిశ, ఆదిలాబాద్ బ్యూరో: సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల్లో సీపీఐ అనుబంధ సంఘ‌మైన ఏఐటీయూసీ స‌త్తా చాటింది. బెల్లంప‌ల్లి రీజియ‌న్‌లోని మూడు ఏరియాల్లో విజ‌యం సాధించి క్లీన్ స్వీప్ చేసింది. బెల్లంప‌ల్లి, మంద‌మ‌ర్రి, శ్రీ‌రాంపూర్ ఏరియాల్లో గెలుపొందింది. ఈ ఎన్నిక‌ల్లో మొద‌టి నుంచి రెండు ప్రధాన సంఘాల మ‌ధ్యే పోటీ న‌డిచింది. కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్య పోటీ నెలకొంది. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలుపొందారు. దీంతో ఖ‌చ్చితంగా ఇక్కడ ఐఎన్‌టీయూసీ పాగా వేస్తుంద‌ని అంతా భావించారు.కానీ,అనూహ్యంగా ఏఐటీయూసీ పుంజుకుని విజ‌యం సాధించింది.

సంప్రదాయ ఓటు బ్యాంకు..టీబీజీకేఎస్ మ‌ద్దతు..

వాస్తవానికి ఏఐటీయూసీకి మొద‌టి నుంచి సింగ‌రేణిలో సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంటుంది. అదే స‌మ‌యంలో, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు కూడా వారికే మ‌ద్దతు తెలిపారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో కాంగ్రెస్ అనుబంధ సంఘ ఐఎన్‌టీయూసీ గెలిస్తే ఆ పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని భావించిన టీబీజీకేఎస్ నేత‌లు ఐఎన్‌టీయూసీని ఓడించేందుకు ఏఐటీయూసీకి మ‌ద్దతు తెలిపారు. దీంతో ఆ యూనియ‌న్‌కు అది అద‌న‌పు బ‌లం అయ్యింది. దీంతో మూడు ఏరియాల్లో ఏఐటీయూసీ విజ‌యం సాధించింది.

గ‌త సంప్రదాయానికి భిన్నంగా..

గ‌త సంప్రదాయానికి భిన్నంగా ఈసారి సింగ‌రేణి ఎన్నిక‌ల్లో ఏఐటీయూసీ అటు గుర్తింపు,ఇటు బెల్లంప‌ల్లి రీజియ‌న్ లో ప్రాతినిథ్య సంఘంగా గెలుపొందింది.సింగ‌రేణి గుర్తింపు సంఘం ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా బెల్లంప‌ల్లి కార్మికుల తీర్పు విల‌క్షణంగా ఉంటుంది. సింగ‌రేణి వ్యాప్తంగా గుర్తింపు హోదా ద‌క్కించుకున్న కార్మిక సంఘం బెల్లంప‌ల్లి ఏరియాలో మాత్రం ఓడిపోయేంది. అయితే గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం సంప్రదాయానికి భిన్నంగా సింగ‌రేణిలో, బెల్లంప‌ల్లి ఏరియాలో టీబీజీకేఎస్ గెలిచింది. ఈసారి కూడా అదే విధంగా గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలుపొంద‌గా, ఇక్కడ బెల్లంప‌ల్లి ఏరియాలో సైతం విజ‌యం సాధించింది.

Advertisement

Next Story

Most Viewed