ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు

by Sridhar Babu |
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు
X

దిశ, మంచిర్యాల : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీఓలు శ్రీనివాస రావు, హరికృష్ణలతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. జైపూర్ మండలం గుత్తదార్ పల్లి గ్రామస్తులు తమ గ్రామంలోని ఇండ్లు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు కింద కోల్పోయామని, నష్టపరిహారం కోరుతూ దరఖాస్తు అందజేశారు. అదే విధంగా కోటపల్లి మండలం సిర్స గ్రామానికి చెందిన పూజారి బక్కమ్మ తన భర్త పేరిట ఉన్న ఇంటిని ఆయన మరణానంతరం తన పెద్ద కుమారుడు తమకు ఎలాంటి సమాచారం లేకుండా మార్చుకున్నాడని, దానిని రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు.

కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామస్తులు తమ గ్రామంలో గుడుంబా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న గుడుంబా, మద్యం విక్రయాలను నియంత్రించాలని కోరారు. మంచిర్యాల పట్టణానికి చెందిన మహమ్మద్ ఆసిఫ్ పాషా తాను పుట్టుకతో నిరుపేద దివ్యాంగుడినని, ఎస్ఎస్సీ పూర్తి చేశానని, ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. అంతే కాకుండా హైదరాబాద్ జీహెచ్ఎంసీ కార్మికులకు అందిస్తున్న వేతనాలను జీఓ ప్రకారం తమకు అందించాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు కోరారు. జన్నారం మండల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు మండల కేంద్రంలో ప్రజల సౌకర్యార్థం 30 పడకల సామాజిక ఆసుపత్రి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం

జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమిక, సామాజిక ఆసుపత్రుల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం ఆసుపత్రి పర్యవేక్షకులు హరిశ్చంద్రారెడ్డి, ఆర్ఎంఓ భీష్మలతో కలిసి ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ, సాధారణ, డయాలసిస్ వార్డులు, ల్యాబ్, మందుల నిల్వలు, రిజస్టర్లు, హాజరు పట్టికలు, పరిసరాలను పరిశీలించారు. ప్రతి వార్డు కలియతిరిగారు. వార్డుల్లో అడ్మిట్ అయిన రోగులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు కనీస సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.

ఆసుపత్రిలోని పడకలకు సరిపడా దుప్పట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసుపత్రిలో ఓపీ సక్రమంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలో నూతన భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని, 3 నెలల్లో పనులు పూర్తి చేసి ఆసుపత్రిని నూతన భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా మెలగాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Next Story

Most Viewed