బెల్లంపల్లి కాంగ్రెస్‌లో ముసలం..విభేదాలకు ఆజ్యం

by Aamani |
బెల్లంపల్లి  కాంగ్రెస్‌లో ముసలం..విభేదాలకు ఆజ్యం
X

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. కొత్త పాత శ్రేణుల సమన్వయ లోపం విభేదాలు గా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసొచ్చిన కొందరు కార్యకర్తల దుందుడుకుతనం పై అదే పార్టీ నాయకులు మీడియా సాక్షిగా ఆరోపణలకు దిగడంతో విభేదాలు ఒక్కసారి గుప్పుమన్నాయి. భూ అక్రమాలు, బెదిరింపుల సంస్కృతి గల వ్యక్తుల వ్యవహార శైలిని కాంగ్రెస్ లోని సీనియర్ నాయకులు అన్వర్ ఖాన్, దేవసానిఆనంద్, అమానుల్లాఖాన్, మాజీ కౌన్సిలర్ పొట్ల సురేష్ బహిరంగ విమర్శలకు దిగడం వాడివేడిగా చర్చ జరుగుతున్నది. ఈ వివాదానికి పట్టణంలోని కన్నాల బస్తీ టీడీపీ చెందిన స్థలం ఆక్రమణ ఆజ్యం పోసింది.సదరు ఆక్రమణదారులకు కాంగ్రెస్ లోని కొందరు వ్యక్తులు అండదండగా ఉన్నారని బహిరంగ వాదన. ఇది కాస్త చినికి చినికి గాలి వానలా కాంగ్రెస్ లోని గ్రూప్ విభేదాలకు దారితీసింది.

కాంగ్రెస్లో కొందరు సీనియర్లు ఇప్పటికే భూకబ్జాలు, అక్రమాలతో కాంగ్రెస్ పార్టీ నైతికత భ్రష్టు పడుతుందని, సిన్సియర్ నాయకులు వాపోతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు కొత్త క్యాడర్ అభ్యంతర చేష్టలు కాంగ్రెస్ పార్టీ పరువు బజారు కెక్కింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన సుదీర్ఘం తర్వాత ఆ పార్టీలో సీనియర్లు రాజకీయ పురోగతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నామినేటెడ్ ఇతర పదవులు దక్కకపోవడంతో కొందరు సీనియర్లు తీవ్ర అసంతృప్తిలో కూరుకుపోయి ఉన్నారు. మరికొందరు తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందనే బాధలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తల వ్యవహారం కొత్త చిచ్చు రేపుతుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే నూకలుకలతో కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీ నిర్మాణ వ్యవస్థ కు కొత్తగా తలెత్తిన విభేదాలు గొడ్డలిపెట్టుగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళలో అధికార పార్టీలో విభేదాలు కొత్త, పాతల మధ్య ఆ పార్టీ మనుగడ పై ప్రభావం చూపకుండాపోవన్న అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. నేర చరిత్ర కలిగిన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలకు అదే కోవకు చెందిన కాంగ్రెస్లోని కొందరు సీనియర్లు వారికి ప్రోత్సాహం అందిస్తున్నారని కొందరూ బాహాటంగానే తమ అసంతృప్తులను వ్యక్తం చేస్తున్నారు.

అంతటితో కాకుండా ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని బాహాటంగానే అసమ్మతివాదులు ప్రకటించడం కాంగ్రెస్ లో విభేదాలు పతాక స్థాయికి చేరాయి. ఈ లుకలుకలు రానున్న స్థానిక సమస్య ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టి సారించకపోవడంపై సీనియర్లు అసహానంలో ఉన్నారు. కొందరి అనైతిక వ్యవహారాలు కాంగ్రెస్ ను ప్రజల్లో అభాసు పాలు చేస్తున్నదని మదన పడుతున్నారు. వలసలు,కొందరు నాయకుల పనితీరు లోపభూయిష్టత, పొరపొచ్చాలకు ఆవాసం చేశాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్లో ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో గట్టి ప్రతికూలతనే కట్టబెడుతుంది. కాంగ్రెస్లో తలెత్తిన విభేదాలు ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీ స్థానిక రాజకీయ భవిష్యత్తుకు చేటు తప్పదని విశ్లేషకులు అంటున్నారు. మరి అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Advertisement

Next Story