చిరుత పులి దాడిపై మంత్రి సీతక్క ఆరా

by Sridhar Babu |
చిరుత పులి దాడిపై మంత్రి సీతక్క ఆరా
X

దిశ, ప్రతినిధి నిర్మల్ : ఆదిలాబాద్ జిల్లా బజార్హాత్నూర్ మండలం డెడ్రా గ్రామంలో అర్క భూంబాయి (52) అనే మహిళ పై చిరుత పులి దాడి చేసి గాయపర్చిన ఘటన పట్ల మంత్రి సీతక్క దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. అటవీశాఖ పీసీసీఎఫ్ డోబ్రియాల్ తో ఫోన్ లో మాట్లాడి చిరుత దాడికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న ఈ గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం గ్రామం చివరకు వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ చిరుత మహారాష్ట్ర సరిహద్దు నుండి ఆదిలాబాద్ లోకి ప్రవేశించినట్లు తెలిపారు.

పశువుల మంద మేత మేస్తున్న సమయంలో వాటి పై దాడి చేయబోయిన చిరుత, మహిళ కదలికలను గుర్తించి అకస్మాత్తుగా దాడి చేసినట్లు వివరించారు. గాయపడిన మహిళలను వెంటనే ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. పూర్తిగా కోలుకున్నాక డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్లు తెలిపినట్లు మంత్రికి వివరించారు. ఇప్పటికే వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించినట్లు స్పష్టం చేశారు. చిరుత దాడి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, చిరుత కదలికల పై నిఘా పెట్టాలని మంత్రి ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed