యూరియా కోసం రైతుల పడిగాపులు

by S Gopi |
యూరియా కోసం రైతుల పడిగాపులు
X

దిశ, లోకేశ్వరం: లోకేశ్వరం మండలంలో యూరియా కోసం రైతులు అగచాట్లు తప్పడం లేదు. పీఏసీఎస్ సొసైటీకి యూరియా వచ్చిందని తెలియగానే వేకువ జాము నుండి రైతులు సొసైటీ ముందు క్యూ కడుతున్నారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని సొసైటీలో శుక్రవారం యూరియా అందుబాటులో ఉంటుందని సొసైటీ సిబ్బంది గురువారం సాయంత్రం సామాజిక మద్యమాల్లో పోస్టు చేశారు. దీంతో ఉదయం ఆరు గంటలకే రైతులు సొసైటీ ముందు క్యూ కట్టారు. ఉదయం నుండి ఎండలు మండుతుండడంతో పది గంటల వరకు కార్యాలయాన్ని తెరిచేవరకు రైతులు ఎండలో క్యూలో నిలబడే ఓపిక లేకపోవడంతో ఇలా చెప్పులను వరుసలో పెట్టి నీడలో వేచి ఉన్నారు. ఒక్కొక్క రైతుకు ఐదు యూరియా బస్తాలు మాత్రమే ఇస్తామని సిబ్బంది చెప్పడంతో అధిక విస్తీర్ణంలో పంటలు సాగు చేసిన రైతులు వారి కుటుంబ సభ్యులను సైతం క్యూలో ఉంచారు.

శుక్రవారం 1350 యూరియా బస్తాలు త్వరగా ఒక్కొక్కరికి ఐదు మాత్రమే ఇచ్చినట్లు పీఏసీఎస్ చైర్మన్ రత్నాకర్ రావు తెలిపారు. ఈ యాసంగిలో లోకేశ్వరం మండలంలో 20 వేల ఎకరాల్లో వరి, 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న, రెండు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపారు. కానీ ఈ విస్తీర్ణానికి సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఏరియా కోసం నానా తిప్పలు పడుతున్నారు. ప్రస్తుతం వరి పంట పొట్ట దశలో ఉన్నందున యూరియా వేయాల్సిన సమయం ఆసన్నమైంది ఇకనైనా సంబంధిత అధికారులు రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed