తల్లి తండ్రుల ప్రశ్నలకు అధికారుల సమాధానాలు కరువు..

by Sumithra |
తల్లి తండ్రుల ప్రశ్నలకు అధికారుల సమాధానాలు కరువు..
X

దిశ, బాసర : బలవంతపు చదువులా లేదా వ్యక్తిగత కారణాలా ఏదైతేనేం బలవన్మరణానికి పాల్పడి ఓ బాలిక అర్ధాంతరంగా తనువు చాలించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ గ్రామానికి చెందిన పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి అనే విద్యార్థిని సోమవారం తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కూతురుకి ఆత్మహత్యకు పాల్పడే అంత బాధలు లేవని తమతో అన్ని విషయాలు పంచుకునే తమ కూతురు మృతికి 15 నిమిషాలకు ముందే మాట్లాడి తదనంతరం ఎలా ఆత్మహత్యకు పాల్పడుతుందని తల్లిదండ్రులు కళాశాల ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఉదయం కూతురి బలవన్మరణ సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలకు చేరుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు స్థానిక ఆర్డిఓ కళాశాల ఇంచార్జి వీసీ గోవర్ధన్ తో కళాశాలలోని ఓ భవనంలో చర్చలు జరుపుతున్నారని, ఈ చర్చలు సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగాయని సమాచారం.

కాగా తమ కూతురు మృతి చెందిన గంటలోపు తాము ఇక్కడికి చేరుకున్నామని ఇంతలో బాడీని పోస్టుమార్టం పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని తల్లిదండ్రులు అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. తమ కూతురు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడే అంత పిరికిది కాదని, తమ కూతురి మరణం పై అనుమానాలు ఉన్నట్లు వారు అధికారులను ప్రశ్నిస్తున్నారని ఉన్నత వర్గాల సమాచారం. అయితే లభ్యమైన సూసైడ్ నోట్ తన కూతురు రాసిందా లేదా అని అధికారులు పరీక్షలు జరిపి తెలియజేయాలని కోరుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో కళాశాల సెక్యూరిటీ ఏబీవీపీ నాయకులపై దాడికి పాల్పడుతున్నప్పుడు ఉదయం నుండి తల్లిదండ్రులతో అధికారులు చర్చించాల్సిన అవసరం ఏముందని, ఏబీవీపీ నాయకులు స్థానిక పోలీసులను, అధికారులను ప్రశ్నించినప్పుడు వారు ఏ విధమైన సమాధానం చెప్పలేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

Advertisement

Next Story