సింగ‌రేణిలో బొగ్గుబ్లాక్‌ల వేలంపై కొన‌సాగుతున్న వివాదం

by Mahesh |
సింగ‌రేణిలో బొగ్గుబ్లాక్‌ల వేలంపై కొన‌సాగుతున్న వివాదం
X

దిశ‌, ఆదిలాబాద్ బ్యూరో: సింగ‌రేణిలో ఇప్పటికే బొగ్గు బ్లాక్ ప్రైవేటీక‌ర‌ణ‌పై ర‌గ‌డ కొన‌సాగుతోంది. ప‌నిలో ప‌నిగా సింగ‌రేణి ప్రవేశ‌పెట్టిన ఓ కొత్త విధానం ఇప్పుడు మ‌రింత ర‌చ్చకు దారి తీస్తోంది. గ‌నిలో ఏదైనా ప్రమాదం సంభ‌విస్తే దానికి కార్మికుడిని బాధ్యుడిని చేసేలా ఈ విధానం రూపొందించారు. కార్మిక సంఘాల‌ను సంప్రదించ‌కుండానే దీనిని రూప‌క‌ల్పన చేయ‌డంతో నేత‌లు మండిప‌డుతున్నారు. దీనిపై పోరాటం చేస్తామ‌ని ప్రక‌టిస్తున్నారు. బొగ్గు గ‌నుల వేలంపై సింగ‌రేణి వ్యాప్తంగా పోరాట కార్యక్రమాలు రూప‌క‌ల్పన చేసిన కార్మిక సంఘాలు ఆ దిశ‌గా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నాయి.

సింగ‌రేణి వ్యాప్తంగా నిర‌స‌న దీక్షలు, క‌లెక్టరేట్ల ముట్టడి ఇలా అన్ని ర‌కాలుగా ఆందోళ‌న‌లు నిర్వహిస్తున్నాయి కార్మిక సంఘాలు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తెలంగాణ ప్రాంతానికి చెందిన బొగ్గు గ‌నుల‌ను సింగ‌రేణికే కేటాయించాల‌ని కోరుతున్నాయి. అవ‌స‌ర‌మైతే సింగ‌రేణి బంద్ నిర్వహించి పెద్ద ఎత్తున ఆందోళ‌న సైతం నిర్వహించేందుకు సైతం కార్యాచ‌ర‌ణ రూపొందించారు. ఎంఎండీఆర్ చ‌ట్టంలోని క్లాజ్ ప్రకారం సింగ‌రేణికే ఈ బ్లాక్‌ల‌ను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు న‌ల్ల బ్యాడ్జీల‌తో నిర‌స‌న వ్యక్తం చేశాయి. జీఎం కార్యాల‌యాల ఎదుట ధ‌ర్నాలు చేప‌డుతున్నాయి. ఇలా అన్ని కార్మిక సంఘాలు పోరాట‌బాట ప‌ట్టాయి.

ప్రమాదానికి కార్మికుల‌నే బాధ్యుల‌ను చేసే కుట్ర..

అటు బొగ్గు బ్లాక్‌ల‌పై ర‌గ‌డ జ‌రుగుతుండ‌గానే మ‌రోవైపు సింగ‌రేణి యాజ‌మాన్యం మ‌రో కుట్రకు తెర‌లేపింది. ప్ర‌మాదాలు జ‌రిగిన సంద‌ర్భంలో కార్మికుల‌నే బాధ్యుల‌ను చేసే విధంగా కొత్త విధానం తీసుకువ‌చ్చింది. ప‌సుపు కార్డు, ఎరుపు కార్డులు జారీ చేసి కార్మికుల‌ను స‌స్పెండ్ చేసేలా ఈ విధానం అమ‌లు చేయ‌నున్నారు. సేఫ్టీ విష‌యంలో కార్మికులు ఏవైనా పొర‌పాట్లు చేస్తే ముందుగా ప‌సుపు కార్డు జారీ చేస్తారు. దీనిని మూడు సార్లు జారీ చేసిన త‌ర్వాత ఎరుపు కార్డు జారీ చేస్తారు. ఇది జారీ చేశారంటే కార్మికులను స‌స్పెండ్ చేస్తారు. ఇవ‌న్నీ కూడా కార్మికుడి పేరుతో కంప్యూట‌ర్లలో ఉంటాయ‌న్న మాట‌.

కార్మిక సంఘాల‌ను ప‌ట్టించుకోలేదు..

అయితే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న సింగ‌రేణి క‌నీసం కార్మిక సంఘాల నేత‌ల‌ను సంప్రదించ‌లేదు. పైగా చాలా అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండానే ఈ విధానం అమ‌లు చేసేందుకు సిద్ధమ‌య్యింది. అయితే, చాలా సంద‌ర్భాల్లో స‌రైన ర‌క్షణ ప‌రిక‌రాలు లేకుండానే కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రమాదం జ‌రిగితే ఎవ‌రు బాధ్యత వ‌హించాలి...? ప‌నిచేసే కార్మికుడా..? లేక అక్కడ బాధ్యత వ‌హించే అధికారా..? ర‌క్షణ ప‌రిక‌రాలు స‌క్రమంగా స‌ర‌ఫ‌రా చేయ‌ని యాజ‌మాన్యమా..? ఎక్కడ ప్రమాదం జ‌రిగినా అధికారులు త‌ప్పించుకునేందుకు కార్మికుల‌పై నెట్టే ప్రమాదం ఉంటుంది. దీంతో అధికారులు త‌ప్పించుకుని కార్మికులు బ‌లిప‌శువులుగా మారుతార‌ని ప‌లువురు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

దీని వ‌ల్ల ఉప‌యోగ‌మేంటి...?

ఈ విధానం వ‌ల్ల ప్రమాదాలు జ‌ర‌గ‌వ‌ని సింగ‌రేణి యాజ‌మాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని ప‌లువురు స్పష్టం చేస్తున్నారు. ప్రమాదాల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్యలు తీసుకోక‌పోగా, నిత్యం నిర్వహించాల్సిన స‌మావేశాలు సైతం యాజ‌మాన్యం, అధికారులు నిర్వహించ‌డం లేదు. మ‌రి ప్రమాదాల నివార‌ణ ఎలా సాధ్యం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిత్యం స‌మావేశాలు నిర్వహించి ఎప్పటిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప ప్రమాదాల నివార‌ణ సాధ్యం కాద‌ని ఇలాంటి నిర్ణయాల వ‌ల్ల కార్మికుల‌కు ఇబ్బందులు త‌ప్ప ఎలాంటి ప్రయోజ‌నం చేకూర‌ద‌ని ప‌లువురు స్పష్టం చేస్తున్నారు.

ఇలాంటి న‌ల్లచ‌ట్టాలు ర‌ద్దు చేయాలి

ఇలాంటి చ‌ట్టాల వ‌ల్ల కార్మికుల‌కు తీర‌ని న‌ష్టం జ‌రుగుతుంది. ఈ నిర్ణయం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌బ‌బు కాదు. కార్మిక సంఘాలను సంప్రదించి కార్మికుల‌కు మేలు జ‌రిగే నిర్ణయాలు తీసుకోవాలి త‌ప్ప, ఏక‌ప‌క్షంగా వ్యవ‌హ‌రించ‌డం స‌రికాదు. యాజ‌మాన్యం త‌న‌కు తానే చ‌ట్టాలు రూపొందించుకోవ‌డం ఏమిటో అర్దం కావ‌డం లేదు. దీనిపై ఖ‌చ్చితంగా పోరాటం చేస్తాం. :-పేరం శ్రీ‌నివాస్‌, బెల్లంప‌ల్లి ఏరియా ఉపాధ్యక్షుడు, ఐఎన్‌టీయూసీ

సింగ‌రేణివి వింత పోక‌డ‌లు

క్రమశిక్షణ చర్యలు భాగంగా ఎల్లో, రెడ్ కార్డు విధానాన్ని వెంటనే విరమించుకోవాలి. ఈ విధానం వల్ల సింగరేణిలో పారిశ్రామిక అశాంతి ఏర్పడుతుంది. సింగరేణి యాజమాన్యం ఇలాంటి వింత పోకడలకు పోకుండా సింగరేణిలోని రక్షణ చర్యలను పెంపొందించాలి. ఈ విధానాన్ని రద్దు చేయ‌క‌పోతే తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం ఆధ్వ‌ర్యంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధం.:-- కేతిరెడ్డి సురేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, టీబీజీకేఎస్

Advertisement

Next Story

Most Viewed