సీఎం రేవంత్ ఇంట్లో కూర్చోవాలా : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

by Sumithra |
సీఎం రేవంత్ ఇంట్లో కూర్చోవాలా : ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ‌హారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ డీ ఫ్యాక్టో సీఎంలా వ్యవహరించడం శోచనీయమని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో క‌లిసి హైదరాబాద్ సెంట్రల్ వ‌ర్శిటీ భూముల వ్యవహారాన్ని సమీక్షించడాన్ని తప్పు పట్టారు. రేవంత్ రెడ్డి ఇక డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయిందని, ఆమె తీరు చూస్తే సీఎం రేవంత్ ఇంట్లో కూర్చోవాలా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలను రాహుల్ గాంధీ తన చేతిలోకి తీసుకున్న‌ట్టుగా అర్థమవుతోందని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మీనాక్షి నటరాజన్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో తాను జోక్యం చేసుకోన‌ని చెప్పారని, కానీ ఆమె మాట త‌ప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెన‌క‌ రాహుల్ గాంధీ ఆదేశాలు ఉన్నాయని తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి హైదరాబాద్ లోనే తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రుల‌తో కలిసి రివ్యూ చేయడాన్ని బ‌ట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇక కోరలు లేని పాము అని అర్థం అవుతుందన్నారు. జై బాపూ, జై భీమ్, జై సంవిధాన్ త‌మ విధానమంటున్న‌ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ త‌మ ద్యేయ‌మ‌ని కార్యక్రమాలను నిర్వ‌హిస్తూ, పాద‌యాత్ర‌లు చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు.. రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ విధానం ఓ నినాదం గానే మిగిలిపోయిందని, అది ఆచరణలో శూన్యమని మీనాక్షి నటరాజన్ నిరూపించాలని పేర్కొన్నారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, గులామం న‌బీ ఆజాద్, వీరప్ప మొయిలీ, వ‌య‌లార్ ర‌వి వంటి నేతలు ఏనాడు ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోలేదని, గతంలో ప్రధానిగా, కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న రాజీవ్ గాంధీ అప్ప‌ట్టో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న‌ అంజ‌య్య‌ను ఎయిరుపోర్టులో అవమానించారని, తండ్రి రాజీవ్ గాంధీ బాట‌లోనే కుమారుడు రాహుల్ గాంధీ న‌డుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర స‌ర్కారును రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాల‌నుకుంటున్నారని, అందుకే మీనాక్షి నటరాజనన్ డీఫ్యాక్టో సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు నరేందర్, నవీన్, పద్మాకర్, సత్యం చంద్రకాంత్, ముత్యం రెడ్డి, జమాల్, విలాస్, విజయ్, తిరుమల చారి, ముత్యం పాల్గొన్నారు.



Next Story

Most Viewed