డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

by Sridhar Babu |
డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి
X

దిశ, జన్నారం : మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నీరటి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ జన్నారం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడంతో ప్రతి ఏటా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న దాదాపు 200 నుండి 300 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

అదే విధంగా రాష్ట్రంలో దాదాపుగా మూడేళ్ల నుండి ఫీజు బకాయిలు విడుదల కాక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. అయినా ముఖ్యమంత్రి విద్యాశాఖ మీద సమీక్ష చేయకపోవడం అన్యాయం అన్నారు. వెంటనే జన్నారం మండలంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నవతరం స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రంజిత్, నగేష్, మహేష్, తిరుపతి, కరుణాకర్, దివ్య, మహేశ్వరి, 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story