పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వలే.. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కార్యకర్తల ఆక్రోశం

by Shiva |
పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇవ్వలే.. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కార్యకర్తల ఆక్రోశం
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ కార్యకర్తలు ఆక్రోశం వ్యక్తం చేశారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కేడర్ పాల్గొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల ముందే ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసే వారికి అవకాశాలు ఇవ్వలేదని, గుర్తింపు దక్కడం లేదని మండిపడ్డారు. పార్టీ పదవులు ఇవ్వలేదు, ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులివ్వలేదని అలాంటప్పుడు ఎలా పని చేయాలని నిలదీశారు. ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్ష పదవి తాతా మధు ఒక్కరికే ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.

ఇలా ఒక్కరికే కాదు చాలా మందికి రెండు పదవులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష పదవి ఇంకొకరికి ఇస్తే బాగుండేది కదా అని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకు లబ్ధి జరిగిందని, కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బైకులల్లో పెట్రోల్ పోసుకుని తిరిగే పరిస్థితి ఇప్పుడు లేదని, పేరుకే కార్యకర్తలమని అన్నారు. పదేళ్లలో ఏనాడూ కార్యకర్తల బాగోగులు పట్టించుకోలేదని, అభిప్రాయాలను సైతం తీసుకోలేదని పశ్నించారు. కేవలం తెలంగాణపై ప్రేమతోనే బీఆర్ఎస్‌లో ఉన్నామని తెలిపారు.మెనిఫెస్టోలో పెట్టకుండా రైతు‌బంధు ఎందుకు ఇచ్చారని.. అస్సలు రైతు‌బంధు ఎందుకు? ఎవరు ఇవ్వమని అడిగారంటూ నిలదీశారు.

అందుకు బదులుగా మద్దతు ధర పెంచితే బాగుండేదని పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎందుకు హైలెట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. మెనిఫెస్టోలో పెట్టిన రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులైన వారికి ఇవ్వకపోవడంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. జరిగిన తప్పిదాలపై సమీక్ష చేయాలని, పునరావృతం కాకుండా చూడాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. పని చేసే కార్యకర్తలను గుర్తిస్తామని మాటల్లో కాదు చేసి చూపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేడర్ ఎక్కువ సమయం తీసుకోకుండా రెండు నిమిషాల్లోనే ముగించాలని పదేపదే నేతలు సూచించారు.

Advertisement

Next Story