Abhaya Hastham: మహిళామణులకు తీపి కబురు.. ‘అభయ హస్తం’ డబ్బులు రిటర్న్!

by Shiva |   ( Updated:2025-02-01 02:13:15.0  )
Abhaya Hastham: మహిళామణులకు తీపి కబురు.. ‘అభయ హస్తం’ డబ్బులు రిటర్న్!
X

దిశ, తెలంగాణ బ్యూరో/నల్లగొండ బ్యూరో: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్రం ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలు జమ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కింద రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తున్నది. వీటితో పాటు ‘అభయహస్తం’ నిధులను సైతం తిరిగి చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్నది.

2009లో ప్రారంభమై 2016లో ముగిసి

అభయహస్తం పథకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2009 సంవత్సరంలో ప్రారంభమై 2016లో ముగిసింది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఐదేళ్ల పాటు ప్రతి రోజూ రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 చొప్పున ప్రీమియం చెల్లించారు. ఈ స్కీంలో రాష్ట్ర వ్యా్ప్తంగా 16 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరు జమ చేసిన సొమ్ము 2016 నాటికి సుమారు రూ.385 కోట్లు ఉండగా, వాటిని చెల్లించేలా సెర్ప్ ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

రూ.385 కోట్లు జమ

మహిళా సంఘాల సభ్యులు 2009 నుంచి 2016 వరకు రూ.385 కోట్లు జమ చేశారు. ఆ పొదుపు చేసిన సొమ్ము 2022 నాటికి రూ.545 కోట్లకు చేరుకుంది. అయితే ఆ డబ్బులను గత ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వాడుకున్నట్లు సమాచారం. 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అభయహస్తం పథకాన్ని రద్దు చేసి ప్రీమియం వసూళ్లను నిలిపి వేసింది. మార్పులు, చేర్పులతో మరింత మెరుగైన రీతిలో మళ్లీ అమలు చేస్తుందని మహిళలు భావించారు. కానీ కొనసాగించకపోగా కట్టిన ప్రీమియం డబ్బులు సైతం వెనక్కి ఇవ్వలేదు. అయితే అభయహస్తం పథకం లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడాన్ని గమనించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రీమియం సొమ్ము తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లోని సెర్ప్‌ సిబ్బంది మహిళల బ్యాంకు ఖాతాలు, ఇతర వివరాలు సేకరించి సర్కారుకు నివేదించారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి రావని ఆశలు వదులుకున్న మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం చేసిన ప్రకటన ఎంతో ఊరట ఇచ్చింది.

వచ్చే వారంలో సభ్యుల జాబితా రెడీ

పొదుపు చేసిన సొమ్ము తిరిగి మహిళా సంఘాలకు ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామాల వారిగా జాబితా సిద్ధం చేయాలని జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల రెండో వారంలో జాబితా సిద్ధం చేసి మంత్ ఎండింగ్ నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.


Next Story

Most Viewed