ప్రజా సమస్యపై అలుపెరగని పోరాటం.. ఓడినా పట్టువదలని వైనం

by Sathputhe Rajesh |
ప్రజా సమస్యపై అలుపెరగని పోరాటం.. ఓడినా పట్టువదలని వైనం
X

దిశ, మేడ్చల్ ప్రతినిధి: ప్రజా సమస్యలపై నిరంతరంగా గళం వినిపించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక పార్టీ మారినా.. ప్రజల మధ్యనే ఉన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. జడ్పీటీసీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారి.. సీఎం కుర్చీలో కూర్చోనునున్నారు.

పొలిటికల్ జర్నీ ఇలా..

2007లో మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌లో ఇండిపెండెంట్‌గా బరిలో నిలిచి జడ్పీటీసీగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2009, 2014లో ఆ పార్టీ తరపున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేసి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక గులాబీ పార్టీ అధికారంలోకి రాగా, అప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు.

2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రజా సమస్యలపై గళమెత్తుతూ.. తనదైన శైలిలో విమర్శలు చేసే రేవంత్ రెడ్డి.. ఇటు ప్రజల దృష్టితో పాటు, కాంగ్రెస్ హై కమాండ్ దృష్టిని సైతం తనవైపు తిప్పుకోలగలిగారు. దీంతో అధిష్టానం ఆయనను 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.

2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత 2019 జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేశారు. ‘ప్రశ్నించే గొంతుక’ను గెలిపించుకోండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై అనుహ్యంగా విజయం సాధించారు. దీంతో 2021లో అధిష్టానం ఆయనను టీపీసీసీ చీఫ్‌గా నియమించింది.

సమస్యలపై నిరంతర గళం

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ భూకబ్జా ఆరోపణలు చేయడం, దానికి కౌంటర్‌గా ఈటల.. నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూమి కూడా కబ్జా చేసిందేనని చెప్పడంతో.. రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. దీంతో రేవంత్ రెడ్డి మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లో పర్యటించి భూములను పరిశీలించారు. స్థానికంగా ఉన్న సీతా రామచంద్ర స్వామి గుడికి చెందిన భూములను కబ్జా చేశారని నిర్ధారించింది. సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్షను చేపట్టారు. దళిత వాడల్లో నిద్ర పోయారు. కాలనీల్లో తిరుగుతూ రచ్చబండ నిర్వహించి దళితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

మూడు చింతలపల్లిలోని లక్ష్మాపూర్ గ్రామంలో రచ్చ బండ నిర్వహించారు. గ్రామానికి నక్ష లేకపోవడం, రైతులకు రైతు బంధు, రైతు బీమా రాకపోవడంతో అక్కడి సమస్యలను పూర్తిస్థాయిలో తెలుసుకున్నారు. మంత్రి మల్లారెడ్డి భూ కబ్జాలపై నిలదీశారు.

కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్లేందుకు రోడ్డు విస్తరణలో మూడుచింతలపల్లిలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటిని కోల్పోయింది. దీంతో రేవంత్ రెడ్డి ఆమెకు ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చి, ఆ తర్వాత ఇంటిని నిర్మించి ఇచ్చారు. అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

కంటోన్మెంట్‌లోని బొల్లారం జనరల్ ఆస్పత్రిలో కరోనా ట్రీట్ మెంట్ కోసం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేశారు. ఆ ఆస్పత్రిని దత్తత తీసుకొని తన సొంత, ఎంపీ నిధులతో 50 ఆక్సీజన్ బెడ్స్ సామర్థ్యంతో కరోనా ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నియోజకవర్గ ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితులకు తక్షణ సహాయాన్ని అందజేయాలని జీహెచ్ఎంసీ కమిషనరేట్‌ను ఎంపీగా రేవంత్ రెడ్డి ముట్టడించారు. వైఎస్ హయాంలో బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్ కోసం కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన పదెకరాల భూమిని కాపాడుకోవడంలో రేవంత్ రెడ్డి పాత్ర కీలకం. కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ లో ఈ భూమిని క్యాన్సల్ చేయాలని ప్రయత్నించగా, రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసి భూమిని కాపాడుకోగలిగారు. గాంధీ ఐడియాలజీ సెంటర్‌కు సోనియాగాంధీతో శంకుస్థాపన చేయించనున్నట్లు ప్రకటించారు.

Advertisement

Next Story

Most Viewed