ఆ పేరుతో పులి తిరుగుతుంది.. సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |   ( Updated:2024-03-06 16:32:29.0  )
ఆ పేరుతో పులి తిరుగుతుంది.. సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ షేర్ అని, ఆయన ఉన్నంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పునాదులను కూడా కదిలించలేరని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ అన్నారు. ఇవ్వాళ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన పాలమూరు సభలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ బీజేపీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో 7 స్థానాలతో ఉన్న బీఆర్ఎస్ మొత్తానికి మునిగిపోయిందని, జాకీ పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదని, కానీ బీజేపీ అక్కడక్కడా ఎగిరెగిరి పడుతోందని విమర్శించారు.

కులం, మతం, సంస్కృతి పేరుతో చిన్నాబిన్నం చేస్తూ.. దేశ మూల సూత్రాలైన సర్వసత్తాక, ప్రజాస్వామ్య, లైకిక, గణతంత్ర రాజ్యాన్ని సర్వనాశనం చేస్తూ, రాజ్యాంగాన్ని పాతాలానికి తొక్కి, ప్రజలను విడదీసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నారని, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ షేర్ అని ఆయన ఉన్నంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ పునాదులను కూడా తాకలేరని, కాంగ్రెస్ జెండా రెపరెపలాడించడానికి రేవంత్ రెడ్డి పేరుతో పులి తిరుగుతుందని అన్నారు.

అటు నాగర్ కర్నూల్ పార్లమెంట్ లో ఒక పార్టీ అభ్యర్ధిని అరువుకు తెచ్చుకుంటే, మరో పార్టీకి అభ్యర్ధులే లేరని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రజల మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో ఎక్కడా అభ్యర్ధులను ప్రకటించకుండా మొదట పాలమూరులోనే ప్రకటించిందని తెలిపారు. కాంగ్రెస్ లో అంచెలంచెలుగా ఎదిగి సీబ్ల్యూసీ మెంబర్ అయిన వంశీచంద్ రెడ్డిని పాలమూరు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed