కేసీఆర్‌కు కొత్త తలనొప్పి.. కంట్రోల్ తప్పుతున్న TRS ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

by GSrikanth |   ( Updated:2022-08-29 13:16:51.0  )
కేసీఆర్‌కు కొత్త తలనొప్పి.. కంట్రోల్ తప్పుతున్న TRS ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకి మోత' అన్నట్లుగా తయారైంది తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సొంత నేతల వర్గపోరు పార్టీ ఇమేజ్‌ను క్రమంగా డ్యామేజ్ చేస్తోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయం సాగుతున్న వేళ అధికార పార్టీలో ఇంటి నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ప్రత్యర్థులకు ఊతమిచ్చేలా మారుతున్నాయి. టీఆర్ఎస్ జెండాను మోసిన వారికే సంక్షేమ పథకాలు అందుతాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఇలా ఉండగానే తాజాగా ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ‌గా సాగుతున్న స్టేషన్ ఘన్ పూర్ రాజకీయం టీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య వర్గపోరు కారు పార్టీలో కుమ్ములాటకు ఆజ్యం పోస్తుందనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఎమ్మెల్యే రాజయ్య చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించినవే అనే గుసగుసలు జోరందుకున్నాయి. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య పోరు పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చేలా ఉందని వీరి విషయంలో అధినేత కేసీఆర్ సైతం కంట్రోల్ చేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్యే సంతకం పెడితేనే:

తాజాగా ఆదివారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గానికి చెందిన పలువురికి మంజూరైన పింఛన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజయ్య హాజర్యయారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ఎమ్మెల్యేల ద్వారానే చేరుతాయని, ఎమ్మెల్సీల నుంచి కాదని అన్నారు. ప్రభుత్వం ఏర్పడాలంటే ఎమ్మెల్యేలతోనే కుదురుతుంది కానీ ఎమ్మెల్సీలతో సాధ్యం కాదని పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇక కల్యాణ లక్ష్మీ రావాలన్నా మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలన్న అందుకు ఎమ్మెల్యేగా తాను ప్రతిపాదిస్తేనే జరుగుతుంది కానీ, ఎమ్మెల్సీ చేతిలో ఏమీ ఉండదని చెప్పుకొచ్చారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు తనను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని ఐదోసారి కూడా గెలిపిస్తారని రాజ్యయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానికేతరులు ఇక్కడ చేసేదేమి ఉండదని చెబుతూ ఎమ్మెల్సీ పాత్ర ఏమీ లేదని చెప్పడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీకి డ్యామేజ్ అయ్యేంతగా వర్గపోరు:

నిజానికి తమ వర్గాలు రెండు కలిసే ఉన్నామని పైకి చెబుతున్నప్పటికీ ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ శ్రీహరి మధ్య కనిపించని శతృత్వం కంటిన్యూ అవుతోందనే ఉందనే టాక్ ఉంది. ఈ ఇద్దరు నేతలు పోటీ పడి నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పార్టీలో అనతి కాలంలోనే మంచి గుర్తుంపు తెచ్చుకున్న రాజయ్య టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేసి ఆ పై బర్తరఫ్ అయ్యారు. ఇక టీడీపీ హయాంలో మంత్రిగా కొనసాగిన కడియం శ్రీహరి సైతం తన క్యాడర్‌ను కాపాడుకుంటూ వస్తున్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి సైలెంట్ కిల్లింగ్ వెపన్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఈ ఇద్దరూ దళిత నాయకులు కావడం ఇద్దరూ సీనియర్లే కావడంతో రాజకీయం రోజు రోజుకూ హీటెక్కుతోంది. కొన్నాళ్లుగా వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందనే విషయం బహిరంగ రహస్యమే. గతంలో పలు సందర్భాల్లో వీరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. కానీ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరస్పరం సహకారం అందించున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే తిరిగి గ్యాప్ ఏర్పడింది. అది నానాటికి పెరిగి రచ్చకెక్కుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ ఇద్దరు నేతల మధ్య టీఆర్ఎస్ పార్టీ కేడర్ అమోమయానికి గురవుతుండగా వీరి ఎపిసోడ్‌కు అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎలా చెక్ పెడతారనేది ఆసక్తిగా మారింది.

ఇవి కూడా చ‌ద‌వండి :

KCR సభలో కలకలం.. నిరుద్యోగి ఆత్మహత్యా యత్నం

దానికి మీ సమాధానం ఏంటి మోడీగారు: సీఎం కేసీఆర్

Advertisement

Next Story