- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరీంనగర్‌లో స్పీడ్ తగ్గిన కారు..? గంగులకు తలనొప్పిగా మారిన అంశమిదే..!
దిశ, కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్ ప్రాతినిధ్యం వహిస్తోన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కారు స్పీడు తగ్గుతుందా..? గత రెండు మూడు రోజులుగా నియోజకవర్గ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గంగులతో పాటు ఆ పార్టీ నేతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. గంగుల ప్రచారానికి వెళ్లిన పలు ప్రాంతాల్లోని ప్రజలు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు తమకు అందలేదని నిలదీస్తుండడం ఓ వైపైతే.. సొంత పార్టీకి చెందిన మైనార్టీ నేతలు ఆయనపై బహిరంగంగా విమర్శలకు పాల్పడటం, వక్ఫ్ బోర్డు భూముల విషయంలో తీవ్ర ఆరోపణలు చేస్తూ సవాల్ విసరడం గంగులకు తలనొప్పిగా మారింది.
అదే విధంగా ఇటీవల రేకుర్తిలోని మైనార్టీలకు సంబంధించిన ఇళ్ల కూల్చివేత విషయంలోనూ మంత్రి ప్రమేయముందని బీఆర్ ఎస్‌కు సంబంధించిన సదరు నేతలు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. గంగుల సొంత సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తూ, మైనార్టీలను పూచికపుల్లగా తీసివేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో కరీంనగర్ నియోజకవర్గంలో ప్రభావితం చూపే మైనార్టీల ఓట్లతో గట్టెక్కుతూ వస్తోన్న గంగులకు వారి మద్దతు లభిస్తుందా..? లేదా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
ఒక వేళ వారి మద్దతు లభించని పక్షంలో గంగుల భవితవ్యమేమిటనేది నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా ఇటీవల పలు ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లిన కమలాకర్‌కు ప్రజల నుంచి వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎవరికీ సంక్షేమ ఫలాలు అందలేదని సాక్షాత్తు మంత్రి ఎదుటనే నిరసన వ్యక్తం చేశారు. ప్రచారానికి వెళ్లిన పలు గ్రామాల్లోని మహిళలే ఈ దిశగా నిరసనలు వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే కాకుండా గంగుల కమలాకర్ కోటరీ కారణంగా నియోజకవర్గంలోని ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
మంత్రి అనుచరులుగా చెప్పుకుంటూ నగరంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా పలువురి భూములను ఆక్రమణలకు గురి చేశారన్న ఆరోపణలు తీవ్ర తరమవుతున్నాయి. ఈ విషయమై పలువురు బాధితులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రెస్ భవన్‌లో విలేకరుల సమావేశంలోనూ తమ గోడు వెళ్లబోసుకున్న ఘటనలు చోటుచేసుకున్నాయి. రేకుర్తిలోని మైనార్టీ వర్గానికి చెందిన మహిళలతో పాటు కరీంనగర్‌కు చెందిన మరో బాధితుడు చిట్టి వెంకటరమణారావు 36 గుంటల భూమిని మంత్రి అనుచరులు బెదిరింపులకు గురి చేసి కబ్జాకు పాల్పడ్డారని పేర్కొంటూ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం గంగుల కమలాకర్‌కు తలనొప్పి వ్యవహారంగా పరిణమించింది.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తోన్న బీసీ బంధు పథకం పంపిణీ విషయంలోనూ పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారుల నుంచి బిఆర్ ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కమీషన్లు తీసుకున్న అనంతరమే చెక్కులు అందించినట్లు ఆరోపణలున్నాయి. వీటితో పాటుగా కరీంనగర్‌లో నిర్వహిస్తోన్న స్మార్ట్ సిటీ పనులు ఇంకా కొనసాగుతుండడం, కేవలం ప్రధాన రహదారులకే ఆ పనులు పరిమితమవడం, ప్రతిష్టాత్మకంగా పర్యటిస్తూ వస్తోన్న తీగల వంతెన పనుల విషయంలో పలు ఆరోపణలు వ్యక్తమవుతుండటం బీఆర్‌ఎస్ నేతలకు తలనొప్పి అంశంగా పరిణమించాయి.
నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభించిన అభివృద్ధి పనులు సగంలోనే వదిలేయడం పట్ల ఆయా ప్రాంతాల్లోని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా నగర పాలక సంస్థలో విలీనమైన గ్రామాలు, శివారు కాలనీల్లో ఆశించిన మేర అభివృద్ధి జరగకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అదే విధంగా నగర వాసుల ఆకాంక్ష అయిన 24 గంటల తాగునీటి సరఫరా విషయంలోనూ గత పదేళ్లుగా హామీలివ్వడమే తప్ప అమలు చేయడంలో చేస్తోన్న తాత్సారం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
నియోజకవర్గంలోని బీఆర్ ఎస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్సీ టి.సంతోష్ కుమార్‌తో పాటు మాజీ కార్పొరేటర్లు, ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడం, తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన పలువురు నేతలు ప్రస్తుతం బిఆర్‌ఎస్ కార్యక్రమాల్లో పాలుపంచుకోకుండా స్తబ్ధంగా ఉండడం బిఆర్ఎస్ గెలుపోటములపై ప్రభావం చూపే అంశంగా పలువురు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు అంతర్గతంగా కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులకు మద్ధతుగా వ్యవహరిస్తున్నట్లు చర్చలు సాగుతున్నాయి. వీటన్నిటికి తోడు ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు బండి సంజయ్‌కుమార్, పురుమల్ల శ్రీనివాస్‌లు గంగుల కమలాకర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ గట్టి పోటీనిస్తుండడంతో నాలుగో సారి విజయం సాధించాలన్న గంగుల ఆశలపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నదన్నది హాట్ టాపిక్‌గా మారింది.