నాలుగు నెలల్లో రూ.1000 కోట్లు.. పార్టీని పాపులర్ చేసేందుకు సీఎం KCR బిగ్ స్కెచ్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-05-11 02:49:26.0  )
నాలుగు నెలల్లో రూ.1000 కోట్లు.. పార్టీని పాపులర్ చేసేందుకు సీఎం KCR బిగ్ స్కెచ్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : 2023–24 బడ్జెట్‌లో ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్‌కు సుమారు వెయ్యి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ కేటాయింపులను ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ఖర్చు చేయాలని సర్కారు భావిస్తున్నది. అందుకోసం కసరత్తు ప్రారంభించింది. వాటిని నాలుగు నెలల్లో ఖర్చు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. కానీ వాటిని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కాకుండా.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ప్రచారం కోసం ఖర్చు చేయబోతున్నదని టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రభుత్వం తరపును చేస్తున్న ఖర్చుగా దీనిని భావించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరుస రివ్యూలు

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్‌పై రివ్యూ నిర్వహించని సీఎం కేసీఆర్.. ఈ మధ్య రెండు, మూడు సార్లు ఆ శాఖ అధికారులతో వరుసగా సమావేశమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అర్థమయ్యే తీరుగా ప్రచారం చేయాలని అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం. ఆ ప్రచారం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలని సూచించినట్టు తెలిసింది. అందుకోసం ఏ పద్దతిని ఎంచుకోవాలి? ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ ఏం చేయాలి? అనే అంశాలపై ఆయన సలహాలు ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారం.

ఎన్నికల షెడ్యూలు వచ్చేలోపే..

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబరు‌లో షెడ్యూలు వచ్చే చాన్స్ ఉన్నది. ఈ లోపు ప్రభుత్వం తరుపున ప్రకటనల రూపంలో ఈ వెయ్యి కోట్లను ఖర్చు చేయాలని భావిస్తున్నది. వాటిని ఎలా ఖర్చు చేయాలి? ఏయే రాష్ట్రాల్లో ఖర్చు చేయాలి? అనే అంశాలపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు వస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. దీంతో ప్రభుత్వం నుంచి ప్రకటనలకు ఒక్క పైసా కూడా ఖర్చు చేసే చాన్స్ ఉండదు. షెడ్యూల్ కన్నా ముందే వాటిని ఖర్చు చేయనుంది.

తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై హోర్డింగ్స్, బస్సులు, ఆటోలపై, సినిమా థియేటర్స్, టీవీ, పేపర్‌లో ప్రకటనలు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా కోసమూ పలు రకాల ప్రకటనలు రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు ఐ అండ్ పీఆర్ శాఖకు పూర్తి స్థాయి కమిషనర్ లేరు. ఇన్‌చార్జీ‌లు మాత్రమే పనిచేశారు. కానీ ఈ మధ్యే ఐఏఎస్‌గా ప్రమోషన్ పొందిన అశోక్ రెడ్డిని ఆ శాఖ కమిషనర్‌గా నియమించారు.

జాతీయ స్థాయిలోనూ భారీ ప్రకటనలకు ప్లాన్

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలకంగా మారుతున్నదని భావిస్తున్న కేసీఆర్.. తెలంగాణ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగానూ పబ్లిసిటీకి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఏ విధంగా ప్రచారం చేయాలి? అందుకోసం ఏయే సంస్థల సహకారం తీసుకోవాలి? అక్కడ సోషల్ మీడియా ప్రచారం కోసం ఏ ఎజెన్సీలను ఆశ్రయించాలి? అనే అంశాలపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Also Read..

ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్.. అన్ని నియోజకవర్గాలను కదిలించేలా వ్యూహం!

Advertisement

Next Story

Most Viewed