‘ఒత్తిడి’ పెంచి.. మమ్మల్ని గాలికొదిలేశారు

by Harish |   ( Updated:2021-09-06 23:36:22.0  )
staff-nurse
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న నర్సులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పడకలకు అనుగుణంగా సిబ్బంది లేక పనిభారం ఎక్కువ అవుతోంది. కరోనా పాండమిక్‌లో ఈ వర్క్ ప్రెషర్ మరింత ఎక్కువైంది. దీంతో నర్సులతో పాటు పేషెంట్లకూ కొత్త ఇబ్బందులు తప్పడం లేదు. సకాలంలో వైద్యసేవలు అందక రోగులు ఇబ్బంది పడుతుంటే, ఐదారుగురు చేసే పనిని ఒకే నర్సు చేయాల్సి వస్తున్నది. కొత్త పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్ట విభజన జరిగిన సమయంలో ఏర్పడ్డ 9,270 పోస్టుల్లో కూడా 3 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆసుపత్రుల్లోని బెడ్లకు అనుగుణంగా నర్సులను నియమించేందుకు నోటిఫికేషన్లు విడుదల చేయకుండా, ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం నర్సులను సతాయిస్తున్నది. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పనిభారంతో చాలా మంది నర్సులకు మానసిక సమస్యలు తతెత్తున్నట్లు నర్సింగ్ అసోసియేషన్ మెంబర్స్ చెబుతున్నారు. అంతేగాక స్టాఫ్ తక్కువగా ఉండటంతో కొన్ని సందర్బాల్లో 24 గంటలు పనిచేయాల్సి వస్తున్నదని గాంధీ ఆసుపత్రికి చెందిన ఓ హెడ్ నర్సు కన్నీళ్లు పెట్టుకున్నారు.

పెరిగిన పడకలకు అనుగుణంగా పోస్టులు ఏర్పాటు చేసి, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్స్ వారు కోరుతున్నారు. అర్హతలు ఉన్నప్పటికీ చాలా మందికి పదోన్నతులు రావడం లేదంటున్నారు. దీంతో కొత్త వారికి అవకాశాలు లభించడం లేదు. ఏళ్ల తరబడి ప్రమోషన్లు పెండింగ్‌‌లో ఉండటంతో స్టాఫ్ నర్సు, హెడ్ నర్సులు వారి వారి స్థానాల్లోనే రిటైర్డ్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొన్నది.

32వేల మంది కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నా..

రాష్ర్ట విభజన తర్వాత ఏర్పాటు చేసిన నర్సింగ్ కౌన్సిల్‌లో ఇప్పటివరకు 32 వేల మంది నర్సులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో ప్రస్తుతం డీఎంఈ, డీహెచ్, టీవీవీపీ పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 6 వేల మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతావారంతా ప్రైవేట్ దవఖానాల్లో పనిచేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. పెరిగిన రోగాలు, రోగులు, బెడ్లకు అనుగుణంగా కొత్త సిబ్బందిని తీసుకోవాల్సి ఉన్నా.. సర్కార్ తీసుకోవడం లేదు. దీంతో అధికారులు సైతం చేసేదేమీ లేక చేతులెత్తేస్తున్నారు. వేల మంది అర్హులు అందుబాటులో ఉన్నా, పోస్టులు లేవని నర్సులు నిరుత్సాహపడుతున్నారు. 2017లో 3వేలకు పైగా పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీన్ని టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టాలని సూచించింది. అయితే, అర్హత లేని వారు క్వాలిఫై లిస్టులో ఉన్నారని కొందరు బాధితులు కోర్టుకు వెళ్లగా, నాలుగేళ్ల తర్వాత ఆ రిక్రూట్ మెంట్ జరిగింది. ఇందులో కూడా కేవలం 2,400 మందిని మాత్రమే ప్రభుత్వం తీసుకున్నది. మరో 800లకు పైగా తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చారంటూ రిజెక్ట్ చేసింది. కానీ, ఆ పోస్టులో అర్హులను భర్తీ చేసుంటే బాగుండేదని నర్సింగ్ యూనియన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

ముఖ్యమైన ప్రభుత్వాసుపత్రుల్లో పరిస్థితి ఇలా..

చిన్నారుల చికిత్స కొరకు అత్యధిక మంది ఆశ్రయించే నిలోఫర్ ఆసుపత్రిలోనూ సిబ్బంది కొరత వేధిస్తున్నది. వాస్తవంగా ఆ హాస్పిటల్ 500 పడకలతో ప్రారంభం కాగా కాలక్రమేణా దానిని వెయ్యి పడకలకు పెంచారు. కరోనా సమయంలో మరో రెండు వందల పడకలను పెంచారు. కానీ, దానికి అనుగుణంగా నర్సింగ్ స్టాఫ్ లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 220 స్టాఫ్ నర్సులు, గ్రేడ్ 1, ఆరుగురు గ్రేడ్ 2 సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, మరో 172 స్టాఫ్ నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గాంధీలో ప్రస్తుతం 1,642 బెడ్లలో కొవిడ్, నాన్ కొవిడ్ ట్రీట్మెంట్ జరుగుతుండగా, కేవలం 493 మంది మాత్రమే నర్సులు పనిచేస్తున్నారు. నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కేవలం 75 మంది స్టాఫ్, హెడ్ నర్సులుండగా, 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎంజీఎంలో 1200 బెడ్లకు కేవలం 449 మంది స్టాఫ్ నర్సులున్నారు. ఇక గ్రేడ్ 1 లేకపోగా, గ్రేడ్ 2 ఒకరు ఉన్నారు. రాష్ర్ట వ్యాప్తంగా ప్రతీ ప్రభుత్వాసుపత్రుల్లో నర్సుల కొరత తీవ్రంగా ఉన్నదని స్వయంగా హెల్త్ ఆఫీసర్లే చెబుతున్నారు. హెడ్ నర్సులకు గ్రేడ్ ప్రమోషన్లు లేక ప్రతీ టీచింగ్ ఆసుపత్రిలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

బెడ్లు పెంచినా ఏం లాభం :

ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు పెంచినా లాభం లేదు. వాటికి అనుగుణంగా నర్సులు, ఇతర స్టాఫ్ లేకపోతే మెరుగైన వైద్యం ఎలా అందుతుంది? సిబ్బంది కొరతతో ఆసుపత్రుల్లో నరకయాతన పడుతున్నాం. అంతేగాక స్టాఫ్, హెడ్ నర్సుల నుంచి గ్రేడ్ 1, 2 ఆఫీసర్‌కు చేరడానికి గతంలో 15 సంవత్సరాలు ఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వంలో అది 25 నుంచి 30 ఏళ్లు పడుతున్నది. దీంతో రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రభుత్వం నర్సులపై వివక్ష కొనసాగిస్తున్నది. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోతే రాష్ర్ట వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుత్లో ధర్నాలు చేపట్టేందుకు కార్యచరణను రూపొందిస్తాం.

-గోవర్ధన్ నర్సింగ్ సమితి అసోసియేషన్ ఫౌండర్

కౌన్సిల్ నిబంధనల ప్రకారం నర్సులు ఉండాల్సిన సంఖ్య ..

వార్డు బెడ్లు నర్సుల సంఖ్య

జనరల్ 5 1
ఐసీయూ 1 1
లేబర్ ప్రతీషిప్టు 4
ఆపరేషన్ ప్రతీషిప్టు 3
ఓపీ .. 1
క్యాజువాలిటీ 1 1
చిన్నపిల్లలు 2 1

(పై సంఖ్యకు అదనంగా 30 శాతం నర్సులను నియమించుకోవాలి. లీవ్స్, ఇతర కారణాలతో సిబ్బంది తక్కువ కాకుండా చూడాల్సిన బాధ్యత మేనేజ్ మెంట్లపై ఉన్నదని నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.)

రాష్ర్ట విభజన జరిగిన తర్వాత మంజూరైన నర్సింగ్ పోస్టులు..

1.డీఎంఈ పరిధిలో…
-స్టాఫ్ నర్స్ : 4194
-హెడ్ నర్స్ : 448
-డిప్యూటీ అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్ నర్స్ : 28
-పబ్లిక్ హెల్త్ నర్స్ …. 27
-నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ lll : 14
– నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ ll : 40
– నర్సింగ్ సుప్రిండెంట్ గ్రేడ్ l : 16

2. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో…
– స్టాఫ్ నర్స్ : 1276
– హెడ్ నర్స్ : 63
-పబ్లిక్ హెల్త్ నర్స్ : 103
-స్టాఫ్ నర్స్ : 32

3.తెలంగాణ వైద్య విధానం పరిషత్తులో..
-స్టాఫ్ నర్స్ : 2273
-హెడ్ నర్స్ : 421
-నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ ll : 82
-నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ l : 30

4.ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో..
-స్టాఫ్ నర్స్ : 1
-హెడ్ నర్స్ : 1

5. ఆయుర్వేద, యూనానిలో..
-స్టాఫ్ నర్స్ : 54
– హెడ్ నర్స్ : 4

మొత్తం పోస్టుల సంఖ్య..
-స్టాఫ్ నర్స్ : 7830
– హెడ్ నర్స్ : 937
– నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ ll :122
-నర్సింగ్ సుప్రిండెంట్ గ్రేడ్ l : 66
-డిప్యూటీ అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ / హెడ్‌నర్స్ : 28
-నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ lll : 14

Advertisement

Next Story