కొవిడ్‌ను తట్టుకునేలా సచివాలయ నిర్మాణం

by  |
కొవిడ్‌ను తట్టుకునేలా సచివాలయ నిర్మాణం
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ సచివాలయ నిర్మాణంలో వాస్తుకే అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యమంత్రి ఛాంబర్ భవనంలోని నైరుతి మూలకు ఉంటుంది. ఇందుకోసం ఆరవ అంతస్తు ప్రత్యేక డిజైన్‌తో ఉంటుంది. సీఎం ఛాంబర్‌తో పాటు ప్రభుత్వ సలహాదారులు, మంత్రివర్గ సమావేశ మందిరం, స్టాఫ్ బ్రీఫింగ్ రూమ్, జీఏడీ, లైబ్రరీ తదితరాలు ఉంటాయి. మూడవ, నాల్గవ, ఐదవ అంతస్తుల్లో మంత్రుల ఛాంబర్లతో పాటు వారు నిర్వహించే శాఖల కార్యాలయాలు, కార్యదర్శులు, అనుబంధ విభాగాలు… తదితరాలు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సందర్శకులు, మీడియా హాళ్ళతో పాటు ఆడిటోరియం ఉంటాయి. భవనం మొత్తానికి మధ్యలో ఉండే బ్రహ్మస్థానం దగ్గర రెండు మీటర్ల వెడల్పుతో ప్రవేశద్వారాన్ని నిర్మిస్తున్నట్లు ఆర్కిటెక్ట్‌ డిజైనర్లు ఆస్కార్, పొన్ని తెలిపారు. భవనం డిజైన్‌ను ప్రస్తుతానికి దాదాపుగా ఖరారు చేసిన వీరు అంతర్గతంగా ఉండే ఆరు అంతస్తుల్లోని గదులు, వాటికి ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరించారు.

వైరస్-ఫ్రీ తరహాలో నిర్మిస్తాం

ప్రస్తుతం కరోనా పరిస్థితుల్ని మనం చూస్తున్నామని, స్పర్శ ద్వారా వైరస్ ఎలా వ్యాపిస్తుందో చూస్తున్నామని, దీన్ని, భవిష్యత్తులో ఇలాంటి వైరస్‌లను దృష్టిలో పెట్టుకుని చేతులు తాకించాల్సిన అవసరం లేని తీరులో పూర్తిగా ఆటోమేషన్ పరిజ్ఞానాన్ని వినియోగించబోతున్నట్లు తెలిపారు. భవనంలో చాలా చోట్ల సెన్సార్లను వినియోగిస్తామని తెలిపారు. పూర్తిగా క్రాస్ వెంటిలేషన్ ఉండే తీరులో తలుపులు, కిటికీలు ఉంటున్నందున ఒకవైపు నుంచి వచ్చిన వైరస్ లేదా బ్యాక్టీరియా మరోవైపు నుంచి వెళ్ళిపోయే తీరులో డిజైన్ ఉంటుందన్నారు. ఏ అంతస్తులో క్యాబిన్‌లో కూర్చుకున్నా ప్రతీ అంతస్తులోని కారిడార్‌ల ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడకు వెళ్తున్నారో కనిపించే తీరులో డిజైన్ ఉంటుందని వివరించారు. ఈ నిర్మాణంలో కొవిడ్ ఒక గేమ్ ఛేంజర్‌గా ఉంటుందని తెలిపారు.

మెట్లు, ర్యాంప్‌లకు ఇరువైపులా…

భవనం మధ్యభాగంలో ఉండే బ్రహ్మస్థానం దగ్గరి ప్రధాన ప్రవేశద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఒకే ర్యాంప్ లేదా మెట్ల మార్గం గుండా ఆరు అంతస్తుల్లోకి వెళ్ళవచ్చని, అలా వెళ్ళేటప్పుడు ఒకవైపు గోడకు మొత్తం 33 జిల్లాలకు ఉన్న ప్రత్యేకతలు పెయింటింగ్స్, మ్యూరల్స్ తదితరాల రూపంలో కనువిందు చేస్తాయన్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద చిత్రాలు కనిపిస్తాయన్నారు. మరోవైపు పచ్చటి లాన్ కనిపిస్తూ ఉంటుందన్నారు. వీలైనంత విశాలంగా ఉండేలా ర్యాంప్ వెడల్పును రెండు మీటర్లు ఉండేలా డిజైన్ చేసినట్లు తెలిపారు.

భవనానికి మూడు ద్వారాలు

ఒకే భవనంగా కనిపించే సచివాలయానికి మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయని, ఒకటి బ్రహ్మస్థానం దగ్గర మధ్య భాగంలో ఉంటే, ఉత్తరం, దక్షిణం వైపు మరో రెండు ద్వారాలు ఉంటాయన్నారు. సీఎం వెళ్ళడానికి ప్రత్యేక మార్గం ఉంటుందన్నారు. భవనానికి ముందువైపు 500అడుగులు, తూర్పు, పడమరవైపు కూడా 500 అడుగుల చొప్పున విశాలంగా ఉంటుందన్నారు. ఇక ఉత్తరం, దక్షిణంవైపు మాత్రం 200 మీటర్లు ఉంటుందన్నారు. రోడ్డుమీద నుంచి సచివాలయంలోకి వెళ్ళే ఎంట్రీ గేట్ దగ్గరి నుంచే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా లాండ్ స్కేపింగ్, గార్డెన్లు ఉంటాయన్నారు. భవనానికి ముందువైపు వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో పచ్చదనం, పార్కులు ఉండాలని సీఎం ప్రత్యేకంగా నొక్కిచెప్పారని గుర్తుచేశారు.

స్థానిక వనరులతోనే నిర్మాణం

సాధారణంగా కొత్త భవనాలకు వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కొన్నింటిని తెప్పించుకోవడం ఆనవాయితీ అని, కానీ ఏడాది కాలంలోనే నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉన్నందున స్థానికంగా దొరికే వనరులనే వినియోగించుకునేలా, వీలైనంత తక్కువగా లేబర్‌ను వాడేలా డిజైన్ చేసినట్లు తెలిపారు. ఇందుకోసం స్మార్ట్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల్లో స్థానికంగా లేబర్ దొరకకపోవడం, వలస కార్మికులతో ఉన్న సమస్యలు తదితరాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నిర్మాణం సమయంలోనే కరోనా ఇబ్బందులు తలెత్తకుండా వీలైనంత తక్కువ మంది మనుషులతో పని జరిగేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో స్మార్ట్ టెక్నాలజీతో నిర్మాణాలు చేసే సంస్థలు చాలా ఉన్నాయన్నారు.

డెక్కనీ-కాకతీయ శైలి కోసం ప్రత్యేక అధ్యయనం

హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయం ఈ డిజైన్‌లో స్ఫూర్తిగా నిలిచిందన్నారు. లోతుగా పరిశీలిస్తే శివుడికి సంబంధించిన కొన్ని అంశాలు ఈ భవనం డిజైన్‌లో కనిపిస్తాయన్నారు. కాకతీయ స్టైల్ మీద చాలా అధ్యయనం చేశామని, జీరో వేస్ట్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. దీని ద్వారా ఖర్చు బాగా తగ్గుతుందన్నారు. భద్రత కోసం ఆర్టిపిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ వస్తువును మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో వినియోగిస్తామన్నారు. అందుకే అన్నింటినీ స్థానికంగానే సమకూర్చుకోనున్నట్లు వివరించారు. జీవితకాలంలో సచివాలయం ఒక్కసారే ఉంటుంది కాబట్టి ఎప్పుడూ దాన్ని ఆస్వాదించే తీరులో నిర్మాణం ఉంటుందన్నారు.


Next Story

Most Viewed