వ్యాక్సిన్ ట్రయల్స్‌కు నూతన ఫ్రేమ్‌వర్క్

by  |
వ్యాక్సిన్ ట్రయల్స్‌కు నూతన ఫ్రేమ్‌వర్క్
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్‌కు సరైన వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఇలాంటి సమయంలో లైసెన్సింగ్ విధానం సరళతరంగా ఉండాలని, అందుకు తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర వైద్యారోగ్య మంత్రి హర్షవర్ధన్‌కు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా పోటీ పెరుగుతున్న తరుణంలో వ్యాక్సిన్ తయారీకి దరఖాస్తు మొదలు క్లినికల్ ట్రయల్స్, టెస్టింగ్, అనుమతులు, తయారీ లైసెన్స్ తదితరు పలు దశల్లో వికేంద్రీకరణ, సరళతర విధానాలు అవసరమని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న వ్యాక్సీన్‌లలో హైదరాబాద్ నుంచే మూడవ వంతు ఉత్పత్తి అవుతున్నదని, ప్రపంచానికే వ్యాక్సిన్ కాపిటల్‌గా ఉన్నదని, సగటున ఐదు బిలియన్ డోస్‌ల మేర తయారవుతున్నదని కేంద్ర మంత్రికి వివరించారు. తగిన అనుమతులు, క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఉత్పత్తి జరిగి ప్రజలకు అందుబాటులోకి రావడానికి నిర్దిష్టమైన ప్రోక్యూర్‌మెంట్ పాలసీ కూడా సత్వరం సిద్ధం కావాలని ఆ లేఖలో సూచించారు.

వాక్సిన్ తయారీలో ముందు వరుసలో ఉన్న కంపెనీలకు కేంద్రం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని, మన దేశ బయోటెక్ రంగ అగ్రస్థానాన్ని కాపాడేలా తీసుకోవాల్సిన వ్యూహంపైన ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. నగరానికి చెందిన మూడు కంపెనీలు కొవిడ్ వ్యాక్సిన్ తయారీకి ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇక్కడి నుంచే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలు సైతం కరోనా చికిత్సలో వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ లాంటి మందుల తయారీలో అగ్రభాగాన ఉన్నాయని తెలిపారు. ఇలాంటి సమయంలో బయోటెక్ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను, అందుకు తీసుకోవాల్సిన చర్యలను మంత్రి ఆ లేఖలో ప్రస్తావించారు.

వ్యాక్సిన్ అనుమతులు, టెస్టింగ్, ట్రాకింగ్ వ్యవస్థను మరింత వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందని, ఫలితంగా క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ల తయారీ వంటివాటిలో కంపెనీలు సులభంగా కృషి చేసే అవకాశం ఉన్నదని, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రత్యేక ఫండింగ్ మద్దతు విషయాన్ని ఆలోచించాలని కోరారు. ప్రస్తుతం సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీ హిమాచల్‌ప్రదేశ్‌లోని కసౌలిలో ఉందని, శాంపిళ్లను పంపడంలో బయోటెక్ పరిశ్రమలకు ఇబ్బందులు ఎదురయ్యాయని, వేగంగా వ్యాక్సిన్‌ను తయారుచేసే ఉద్దేశంతో పనిచేస్తున్న కంపెనీలకు సులభంగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఇచ్చిన వెసులుబాటును శాశ్వతంగా ఉండేలా చూడాలని కోరారు.

సీడీఎస్‌సీఓ జోనల్ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానించిన కేటీఆర్ దీనికి మరిన్ని అధికారాలు, నిధులు ఇచ్చి బలోపేతం చేయాలని కోరారు. వాక్సిన్ తయారీ కోసం ఆరు కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి రావాల్సి ఉంటుందని, దీనికి తోడు రాష్ట్ర స్థాయిలోనూ అనుమతులు అవసరమని, ప్రపంచ పోటీతత్వాన్ని తట్టుకోవాలంటే ఈ సంక్లిష్ట ప్రక్రియను సులభతరం చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.


Next Story